Damodar Raja Narasimha: వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సహకార సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్‌లతో పాటు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కూడా ముందుకు వస్తే వారికి అవకాశం కల్పించి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) అన్నారు. జోగిపేట మార్కెట్ యార్డ్ లో సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులు పండించిన ప్రతి వరి గింజనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
సింగూరు కాల్వ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు
సన్నాలను ప్రోత్సహించడానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ను అందిస్తున్నామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను 24 గంటలలోపే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఆందోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు ఉన్నాయని గుర్తు చేశారు. 2005–06లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో సింగూరు కాల్వ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. నియోజకవర్గంలో ఎక్కువ శాతం వరి, పత్తి పంటలను పండిస్తారని, సాగునీరు, నీటి వ్యవస్థకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ శేరి జగన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎం. జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
