Damodar Raja Narasimha: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో విద్యావకాశాల్లో సామాజిక న్యాయం సాధ్యమైందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) పేర్కొన్నారు. ఇంతకాలం నామమాత్రంగా ఉన్న వర్గాలకు, రిజర్వేషన్ల వర్గీకరణతో ఈ ఏడాది ప్రొఫెషనల్ కోర్సుల్లో సముచిత ప్రాధాన్యం లభించిందని ఆయన తెలిపారు. ఉదయం సెక్రటేరియట్‌లో ఇంజినీరింగ్, మెడికల్ తదితర కోర్సుల్లో సీట్లు, ఇతర అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం ప్రకారమే ఈ ఏడాది సీట్లను భర్తీ చేశారు.
Also Read: Damodar Raja Narasimha: పరిశుభ్రత పేషెంట్ కేర్‌పై.. ఆరోగ్యశాఖ మంత్రి స్పెషల్ ఫోకస్
ప్రభుత్వ మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు
దీని ఫలితంగా ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన పిల్లలకు కూడా ఈ ఏడాది మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో సముచిత సంఖ్యలో సీట్లు రావడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. వర్గీకరణ ఫలితంగానే అత్యంత వెనుకబడిన కులాలైన బావురి, మెహతర్, మాంగ్, బేడ బుడగ జంగం వంటి వర్గాల పిల్లలకు కూడా ప్రభుత్వ మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. రిజర్వేషన్ల వర్గీకరణ ఫలాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి విద్యతోనే సాధ్యం అవుతుందని తమ ప్రభుత్వం నమ్ముతోందన్నారు.
ఇంజినీరింగ్, మెడికల్ అడ్మిషన్లలో సీట్లు
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇంజినీరింగ్, మెడికల్ అడ్మిషన్లలో సీట్లు పొందిన ఎస్సీ కులాల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు, ఇంగ్లిష్ భాష రాకపోవడం వంటి సమస్యల వల్ల డ్రాప్ అవుట్ అవకుండా చూసుకోవాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులను ఆత్మన్యూనతకు లోను అవ్వకుండా ఉండేందుకు.. ఫాకల్టీ, సీనియర్ స్టూడెంట్లతో మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రత్యేక తరగతులు, సైకాలజిస్టులతో మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎస్సీ వర్గాలకు వచ్చిన సీట్లు..
కోర్సు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3
ఎంబీబీఎస్ 41 సీట్లు 561 సీట్లు 324 సీట్లు
ఇంజనీరింగ్ 378 సీట్లు 8,246 సీట్లు 5,466 సీట్లు
ఫార్మసీ 60 సీట్లు 1,603 సీట్లు 898 సీట్లు
Also Read: Mahavatar Narasimha: ఆ నిర్మాతకు కాసులు కురిపిస్తున్న కన్నడ ఫిలిం.. లాభం ఎంతంటే?
