Warangal News: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అడుగులు వేస్తుందని, అందులో భాగంగా క్రీడల పట్ల ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ, క్రీడలు, యువజన సర్వీసులు శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం హనుమకొండ హయగ్రీవాచారి స్టేడియంలో నాయిని విశాల్ ట్రస్ట్, క్రెడాయి వరంగల్ సహకారంతో నిర్వహించిన వరంగల్ ఫస్ట్ ఎడిషన్ హాఫ్ మారథాన్ కార్యక్రమానికి ఆయన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
క్రీడలకు ప్రాధాన్యం..
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ… ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, క్రీడలు తప్పనిసరి అని అన్నారు. మారుతున్న కాలానికి ఆరోగ్య సూత్రాలు పాటించడం అవసరమని చెప్పారు. వారసత్వ సంపద, చరిత్ర కలిగిన వరంగల్ నగరం వేదికగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఆరోగ్యం, మత్తు పదార్థాల విముక్తి స్ఫూర్తితో నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ మారథాన్ వరంగల్ నగరానికి మరో ప్రత్యేకతను తీసుకువచ్చి, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Maloth Kavitha: భగవాన్ సత్య సాయిబాబా ఆలోచనలు ఆశయాలు ఆచరణీయం: మాలోతు కవిత
నూతన క్రీడా విధానం..
స్థానిక ఎమ్మెల్యేల సమిష్టి కృషితో వరంగల్ నగరానికి స్టేడియం, క్రీడా పాఠశాల ఏర్పాటుతో ప్రపంచ స్థాయి హంగులు లభించాయి. రాష్ట్రంలోని ప్రతి క్రీడా మైదానాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా స్ఫూర్తితో నూతన స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన చేస్తున్నారని, ‘సీఎం కప్’ పేరిట గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నామని మంత్రి అన్నారు. ఈ హాఫ్ మారథాన్‌లో 2600 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయం అని మంత్రి తెలిపారు. 21 కిలోమీటర్ల మారథాన్‌ను ఉదయం 05:30 గంటలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించగా, 5 కిలోమీటర్ల రన్నింగ్‌ను మంత్రి శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నగర పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Trump Tariffs: ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్.. కుప్పకూలిన 15 మార్కెట్లు.. భారీ నష్టం

