Suryapet: నాసిరకం వస్తువులను విక్రయిస్తూ స్థానిక వ్యాపారులను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ సూర్యాపేట(Suryapet)లో మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు భారీ ర్యాలీ, దుకాణాల బంద్ నిర్వహించారు. “మార్వాడీ హటావో, తెలంగాణ బచావో” అంటూ నినాదాలు చేస్తూ సిమెంట్, ఐరన్, హార్డ్‌వేర్, శానిటరీ, పెయింట్స్, ఫ్లైవుడ్, ఎలక్ట్రికల్ వ్యాపార సంఘాల నాయకులు ఫిరోజ్, సోమ దయాకర్, వెంపటి నవీన్, భాగ్యశ్రీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మార్వాడీ వ్యాపారులు తక్కువ ధరలకే నాసిరకం వస్తువులను అమ్మి, స్థానిక వ్యాపారులకు నష్టాలు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌ల దుర్మార్గాలు.. ఫీజుల కోసం విద్యార్థులపై దాడులు
రూ. 50కి అమ్ముతున్నారు
తాము రూ. 50కి కొన్న వస్తువును రూ. 50కి కూడా అమ్ముకోలేకపోతున్నామని, కానీ వారు రూ. 30కి తెచ్చిన వస్తువును రూ. 50కి అమ్ముతున్నారని తెలిపారు. వారు వస్తువులకు పన్నులు చెల్లించరని, వినియోగదారులకు బిల్లులు కూడా ఇవ్వరని ఆరోపించారు. తమ దుకాణాల్లో తమ వాళ్లనే పనిలో పెట్టుకోవడం వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు లేకుండా పోతున్నాయని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారులు మాట్లాడుతూ.. తాము నాణ్యమైన వస్తువులను విక్రయిస్తున్నా ప్రజలు తమను నమ్మడం లేదని, దీంతో తమ జీవనం కష్టంగా మారిందని వాపోయారు.
చర్యలు తీసుకోవాలి
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారాలు మూసివేయక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకొని మార్వాడీల వ్యాపార కార్యకలాపాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే, నాణ్యమైన వస్తువులను విక్రయించాలని, స్థానికులకే ఉపాధి కల్పించాలని వారు హెచ్చరించారు. ఈ నిరసనలో వ్యాపార సంఘాల జేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ