Karimnagar ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Karimnagar: కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదం.. పట్టించుకోని అధికారులు

Karimnagar: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నెలకొన్న దయనీయ పరిస్థితి బాలికా విద్యార్థుల ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ప్రమాదంలో పడేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలల నిర్వహణపై గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్ర స్థాయిలో కనీసం కూరగాయలు కూడా సరఫరా చేయలేని దుస్థితి బయటపడింది. ఏకంగా గత 20 రోజులుగా ఈ విద్యాలయంలో కూరగాయల జాడే కరువైంది. దీంతో ఇక్కడి 175 మంది విద్యార్థులు కేవలం పప్పు, గుడ్లు, వారంలో రెండు రోజులు చికెన్/మటన్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు.

Also Read:Karimnagar: నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపుల దందా.. ఫార్మసిస్ట్ లేకుండా జోరుగా మందుల విక్రయాలు!

పప్పు, సూప్‌లతో మాయాజాలం

​ఈ పాఠశాలలోని విద్యార్థులకు నిత్యం ఏదో ఒక కూరగాయతో పౌష్టికాహారం అందించాల్సిన అధికారులు, ఈ నెల 6వ తారీఖు నుంచీ పూర్తిగా చేతులెత్తేశారు. ప్రతిరోజూ ఇచ్చే గుడ్డును అడ్డం పెట్టుకుని, ఒక పూట పప్పు పెడితే, మరో పూట ‘ఎగ్ సూప్’, ఇంకో పూట ‘ఎగ్ కర్రీ’ అంటూ విద్యార్థులను మభ్యపెడుతున్నారు. ఉదయం టిఫిన్‌ నుంచి రాత్రి భోజనం వరకు కూరగాయలు లేకపోవడంతో, నిస్సారమైన, పౌష్టికాహార లోపంతో కూడిన భోజనాన్ని విద్యార్థులు తినాల్సి వస్తోంది. ప్రతిరోజూ పప్పు, గుడ్లే తినాల్సి రావడంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి, ఇబ్బంది వ్యక్తం చేస్తున్నారు.

​అధికారుల పలుకుబడిపై ప్రశ్నార్థకం

​ఈ వ్యవహారంపై కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్‌ను వివరణ కోరగా, వారు వెల్లడించిన సమాధానం అధికారుల నిర్లక్ష్యం, నిస్సత్తువకు అద్దం పడుతోంది. “కలెక్టర్ గారికి, డీఈఓ గారికి లెటర్ ఇచ్చాం. టెండర్ కాలేదండి, టెండర్ అయితేనే రెగ్యులర్ గా కూరగాయలు వస్తాయి. ఈలోపు పూటకు సరిపడా కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని టమాటాలు తెప్పిస్తున్నాం. మంది ఎక్కువ కాబట్టి సరిపోవటం లేదు” అని చెప్పడం విడ్డూరం.

కాంట్రాక్టులు అడ్డు వస్తున్నాయా?

లెటర్లకే సరిపోయారు: 20 రోజులుగా విద్యార్థులకు కూరగాయలు లేకపోయినా, స్పెషల్ ఆఫీసర్లు కేవలం కలెక్టర్‌గారికి, డీఈఓ గారికి ‘లెటర్లు’ ఇవ్వడం వరకే పరిమితమయ్యారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆకలి వారికి లెక్క లేకుండా పోయింది. కేవలం ఒక లెటర్ ఇచ్చి చేతులు దులుపుకుంటే, 175 మంది బాలికల పోషణ ఎలా జరుగుతుంది? ఇది కచ్చితంగా అధికారుల ఘోర నిర్లక్ష్యం టెండర్ల సాకు: పేద విద్యార్థినులకు పౌష్టికాహారం అందించడానికి టెండర్లు, కమీషన్లు, కాంట్రాక్టులు అడ్డు వస్తున్నాయా? 20 రోజులుగా టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోవడం వెనుకగల అధికారుల చేతగానితనం ఏమిటి? ప్రత్యామ్నాయంగా స్థానికంగా కూరగాయలు కొనుగోలు చేసే వెసులుబాటు లేదా? బాలికల భవిష్యత్తు, ఆరోగ్యం కంటే టెండర్ ప్రక్రియ ముఖ్యమా? జిల్లా మొత్తంలో ఇదే దుస్థితి.

తక్షణ చర్యలు తీసుకోవాలి

ఈ సమస్య తమ పాఠశాల ఒక్కదానికే పరిమితం కాదని, కరీంనగర్ జిల్లా మొత్తంలో ఉన్నది అని స్పెషల్ ఆఫీసర్ చెప్పడం జిల్లా విద్యా వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. జిల్లా మొత్తం కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులు కూరగాయలు లేని భోజనం తినాల్సి వస్తుందంటే, విద్యా శాఖాధికారులు, జిల్లా కలెక్టర్ దీనిపై వెంటనే స్పందించి, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ​తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, కేజీబీవీ విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేలా చూడాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Also Read: Warangal: పిల్లల ప్రాణాలు అంటే మీకు లెక్క లేదా?.. వరంగల్ ఎంజీఎంలో దారుణ ఘటన 

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు