Bhadradri Kothagudem: మండలంలోని మనుబోతుల గూడెం, వేములూరు మారుమూల గిరిజన గ్రామాలు. వారంతా నిరుపేద ఆదివాసీలు. ఎటువంటి అభివృద్ధికీ నోచుకోక అటవీ ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నవారు. గ్రామాలకు కనీసం రహదారులు కూడా లేక అత్యవసర పరిస్థితుల్లో ఆపద పాలవుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బిక్కుబిక్కుమంటున్నారు. నిత్యావసరాలు కూడా అందని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎడ్లబండి వెళ్లేందుకు కూడా వీల్లేని పరిస్థితులు ఉండడంతో ఏవైనా ప్రమాదాలు జరిగినా, గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా దేవుడిపైనే భారం వేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతాలకు రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చే పాలకులు ఆ తరువాత తమ హామీలను విస్మరిస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్లను మంజూరు చేసినా అటవీశాఖ అభ్యంతరాలు చెబుతోంది. దీంతో గిరిజనులు ప్రత్యక్ష నరకాన్ని ఎదుర్కొంటున్నారు.
అశ్వాపురం మండలంలోని సుమారు 15 ఆవాసాలకు లేని రోడ్డు
మండలంలోని ఏజెన్సీలో ఇప్పటికీ10 గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ముఖ్యం గా వేములూరు, మనుబోతులగూడెం, గ్రామాలకు రోడ్డు ఆనవాళ్లు కూడా లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఎటువైపు రోడ్డు కనెక్టివిటీ లేక నాగరికతకు దూరంగా కొట్టుమిట్టాడుతున్నాయి. గొంది గూడెం కొత్తూరు వరకు రోడ్లు ఉన్నప్పటికీ ఏటా వర్షాకాలంలో మట్టి రోడ్లు బురదగుంటలుగా మారుతున్నాయి. పక్కా రోడ్లు నిర్మించాలన్న ప్రతిపాదనలున్నా అటవీశాఖ అనుమతుల రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మనుబోతుల గూడెం వేములూరు గ్రామాలకు ఎటువంటి రహదారి లేదు. వర్షాకాలంలో ఇసుక వాగు ప్రవహిస్తే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు ఈ గ్రామాలను సందర్శించి సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటివరకు నెరవేర్చలేదు. రహదారుల నిర్మాణం హామీలకే పరిమితమయింది.
Also Read: Bhadradri Kothagudem: గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				