Sudheer Babu: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా చిన్నపాటి పొరపాటుకు కూడా తావు ఇవ్వొద్దని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు(Sudheer Babu) చెప్పారు. సమ్మిట్ ముగిసే వరకు ప్రతీ ఒక్కరూ అలర్ట్ గా ఉండాలన్నారు. రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఈనెల 8, 9వ తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ జరుగనున్న విషయం తెలిసిందే. దీనికి దేశ విదేశాల నుంచి పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలు రానున్నారు. ఈ నేపథ్యంలో సమ్మిట్ సందర్భంగా తీసుకుంటున్న భద్రతా చర్యలపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సోమవారం అదనపు డీజీ డీ.ఎస్.చౌహాన్, ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ శశాంకతోపాటు అన్ని విభాగాల హెచ్ఓడీలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
గ్లోబల్ సమ్మిట్ పనులు పూర్తి చేయాలి
ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి గ్లోబల్ సమ్మిట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. వేర్వేరు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే అతిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. తమకు కేటాయించిన పనులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. ఇంటర్నెట్, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలన్నారు.
Also Read: Sudheer Babu: అక్కడ కష్టాలు తెలియకపోవచ్చు.. కానీ బాధను అనుభవించా.. సుధీర్ బాబు
పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అతిధులు విమానాశ్రయంలో దిగి సమ్మిట్ జరిగే ప్రాంతానికి చేరుకుంటారని చెబుతూ ఎయిర్ పోర్టు నుంచి అక్కడి వరకు ఉన్న రోడ్డును అద్దంలా మెయిన్ టెయిన్ చేయాలని చెప్పారు. రోడ్లపై ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, ప్రొటోకాల్ సెక్రటరీ నర్సింహారెడ్డి, మెట్రోపాలిటన్ నీటి సరఫరా బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ప్రేమ్ రాజ్ తోపాటు వేర్వేరు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Also Read: Minister sudheer babu: మా వద్దకు రండి కలిసి అద్భుతాలు ఆవిష్కరిద్దాం: మంత్రి శ్రీధర్ బాబు

