Ponguleti Srinivas Reddy: మేడారం మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. కోటి భక్తుల కొంగు బంగారం, తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో అత్యంత పవిత్రమైన మొదటి ఘట్టం ప్రారంభమైన నేపధ్యంలో సచివాలయం నుండి హై ఫ్రీక్వెన్సీ వాకీటాకీతో మేడారంలో ట్రాఫిక్ విధులను పర్యవేక్షిస్తున్న సిబ్బందితో మంత్రి మాట్లాడారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలి
తొలిరోజు కావడంతో భక్తుల సంఖ్య , సారలమ్మ వార్ల రాక ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, జాతరలో నెలకొన్న పరిస్థితులు గురించి మంత్రి ఆరాతీశారు. ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రవాణా సౌకర్యాలు ఎప్పటికప్పుడు పరీక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన జంపన్న వాగులో స్నానాలు సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

