Ponguleti Srinivas Reddy: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) పిలుపునిచ్చారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇల్లందు, ఏదులాపురం మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య నేతలు, ఆశావహులతో ఆయన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నగారా అతి త్వరలోనే మోగనుందని మంత్రి వెల్లడించారు. వచ్చే నెల ఫిబ్రవరి 15న శివరాత్రి నాటికి ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్, ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పార్టీ శ్రేణులు ఇప్పుడే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు
అభ్యర్థుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. “టికెట్ల కేటాయింపులో పైరవీలకు, వారసత్వ రాజకీయాలకు తావులేదు. నా రక్తసంబంధీకులకు కూడా టికెట్లు ఇవ్వను. ఇప్పటికే రెండు, మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా సర్వేలు చేయిస్తున్నాం. ప్రజలు ఎవరినైతే ఆదరిస్తారో, ఎవరికైతే గెలిచే సత్తా ఉందో వారికే బి-ఫామ్ అందుతుంది” అని ఆయన తేల్చి చెప్పారు.
అసంతృప్తులకు సముచిత స్థానం
టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని, అందరికీ ఏదో ఒక రూపంలో రాజకీయ గౌరవం కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. “ఒక వార్డులో ఎక్కువ మంది ఆశావహులు ఉండటం సహజం. టికెట్ రాని మిత్రులను భవిష్యత్తులో కో-ఆప్షన్ సభ్యులుగా లేదా నామినేటెడ్ పదవుల ద్వారా గౌరవిస్తాం. పార్టీని కాదని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి రాజకీయ భవిష్యత్తు పాడుచేసుకోవద్దు” అని హెచ్చరించారు.
ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతా
ఇల్లందు, ఏదులాపురం మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని పొంగులేటి ప్రకటించారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, భవిష్యత్తులో మరింత భారీగా నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాల రూపురేఖలు మారుస్తామని వాగ్దానం చేశారు. “కార్యకర్తలే నా బలం, నా కళ్ళు.. మిమ్మల్ని ఎప్పుడూ విస్మరించను” అని ఆయన ఆత్మీయంగా పేర్కొన్నారు.

