Ponguleti Srinivas Reddy: ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలోని పెద్దలు భూములను కాజేశారని, దీనిపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధతో పైలట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించామన్నారు. ఇందులో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాధమిక నివేదికలో స్పష్టమైందన్నారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ధరణి పోర్టల్ అంశంపై ఉన్నత స్థాయి కమిటీతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఎవరి పాత్ర ఎంత?
విచారణలో ఎదురైన అంశాలు, ఎవరి పాత్ర ఎంత? తెరవెనుక ఎవరైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వంటి అంశాలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ప్రాథమిక నివేదికను పరిశీలించి మరికొన్ని సలహాలు సూచనలు చేస్తూ మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని సూచించారు. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 35 లక్షల లావాదేవీలు జరిగాయని, ఇందులో ప్రాథమికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించడం జరిగిందని, అయితే విచారణ తర్వాత 1,109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు నాలుగు కోట్ల రూపాయిలు ప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు.
48 మందిపై క్రిమినల్ కేసులు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం అనాలోచితంగా ఎలాంటి ముందుచూపు లేకుండా ఒక కుట్ర పూరితంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొంతమంది అక్రమాలకు పాల్పడితే భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించి తక్షణమే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, విచారణ చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి 9 జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వాస్తవ పరిస్దితి ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు వెయ్యి కోట్ల అవినీతి అని, మరో నాయకుడు పదివేల కోట్లు అని, ఇంకొకరు భూభారతి పోర్టల్ అవినీతి మయమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
నేడు ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు
ఇప్పటికే మొదటి విడుతలో నాలుగు వేల మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు జారీ చేయగా, ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మరో రెండు వేల మందికి లైసెన్స్‌లు జారీ చేయనునున్నట్లు వెల్లడించారు. ఈ లైసెన్స్డ్ సర్వేయర్లతో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటిలిజెన్స్ అదనపు డీజీ విజయ్‌కుమార్, ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు డిఐజీ ఎం సుభాషిని, సీఎంఆర్వో మకరంద్, ఎసీబీ ఎస్పీ సింధు శర్మ సైబర్ క్రైమ్ డీఎస్పీ సంపత్, ఎన్ఐసీ ప్రతినిధి శ్రీనివాస్, హోంశాఖ సలహాదారు శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌వి మతిలేని మాటలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన కేటీఆర్ మాట్లాడుతున్న భాష సరిగ్గా లేదని, మతి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలను వ్యక్తిగతంగా తాను రిఫరెండంగా భావిస్తున్నానని అన్నారు. ఇప్పటికే రెండు సార్లు కేటీఆర్ రిఫరెండం అన్నారని, మళ్లీ ఇప్పుడు రిఫరెండం అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు జరిగిందే ఈ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని ఎద్దేవా చేశారు.

