Ponguleti Srinivas Reddy: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని ఆయన రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
మార్చి నాటికి గృహప్రవేశాలు
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈ ఏప్రిల్‌లో మరో విడుత, రానున్న రెండేళ్లలో రెండు విడుతలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. హుజూర్‌నగర్ కాలనీ పనులను మార్చి 31లోగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతిలోపు అర్హులైన పేదల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామని, లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Ponguleti Srinivas Reddy: భూభారతి పోర్టల్‌తో అనుసంధానం.. ఒక్క క్లిక్‌తో రైతులకు పూర్తి భూసమాచారం!
దేశానికే మోడల్ కాలనీ
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2012లో తాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలనీకి పునాది వేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పనులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దేవాదాయ శాఖకు చెందిన 115 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ కాలనీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాలనీలో కేవలం ఇళ్లే కాకుండా పాఠశాల, అంగన్‌వాడీ, హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హాల్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు
నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని, నిరంతర పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌ను మంత్రులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

