Mallu Ravi: తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారని ఎంపీ మల్లు రవి (Mallu Ravi) ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ, ప్రజా పాలన వైపే ఓటర్లు మొగ్గు చూపారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీ మల్లు రవి విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన సాగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారన్నారు. పేదలకు సన్న బియ్యం, 200 యూనిట్ల కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Mallu Ravi:పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం : ఎంపీ మల్లు రవి
బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో విచారణ
ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.3500 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నదని, అందుకే వేగంగా సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో విచారణ, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందన్నారు. హరీష్, కేటీఆర్ లకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదన్నారు. ఇక హర్యానాలో దళిత ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తాను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశానన్నారు. అలాగే పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని 8 పేజీల లేఖ రాశానని వివరించారు. తన పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన తలసేమియా బాధితురాలికి.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల సాయం అందిందని ఇందుకు మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: MP Mallu Ravi: ప్రతి పథకం ప్రజలకు చేరాలి.. ఎంపీ డాక్టర్ మల్లురవి
