National Hndloom Day: చేనేతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి ఒక్కరూ గద్వాల చీరలను బహుమతిగా ఇచ్చి, మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్‌ఆర్ చౌక్ నుంచి అనంత ఫంక్షన్ హాల్ వరకు చేనేత వస్త్రాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేనేత దుస్తులతో ఆకట్టుకునే ఫ్యాషన్ షో నిర్వహించారు.
Also Read: TS News: ఖమ్మం కలెక్టరేట్‌లో డ్రైవర్.. ఎవరూ ఊహించని పనులు!
నేతన్నకు చేయూత..
కలెక్టర్ బీఎం సంతోష్(Santhosh) మాట్లాడుతూ.. చేనేత అనేది కేవలం ఒక జీవనోపాధి మాత్రమే కాదని, అది భారతీయ సంస్కృతిలో ఒక మూలస్తంభమని చెప్పారు. ప్రజలందరికీ చేనేత పట్ల అవగాహన పెంచాలన్నదే జాతీయ చేనేత దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గద్వాల(Gadwal) చీరలకు 200 ఏళ్ల చరిత్ర ఉందని, అవి కాటన్-సిల్క్ మేళవింపుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. చేనేత అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, ఆన్‌లైన్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా వాటిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. “నేతన్నకు చేయూత”లో 6,000 మందిని ఎంపిక చేశామని, చేనేత రుణమాఫీలో 1,761 మందికి ₹12 కోట్లు మంజూరు చేశామని ఆయన వివరించారు.
గద్వాల ఖ్యాతిని పెంచుదాం..
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Bandla Krishnamohan Reddy) మాట్లాడుతూ.. గద్వాల చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, భౌగోళిక గుర్తింపు లభించడం గద్వాల ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనమని అన్నారు. చేనేత కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు జియోట్యాగింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాషన్ షోలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి సహాయ సంచాలకులు గోవిందయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
