Gadwal Municipal Elections: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే గద్వాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే వార్డుల్లో ఆశావహుల సందడి మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. గద్వాల, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.
ఇంటింటికీ ఆశావహులు
ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూడకుండానే అభ్యర్థులు ముందస్తు ప్రచారానికి తెరలేపారు. వార్డుల్లోని ప్రతి ఇంటినీ సందర్శిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని, అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. “ఈసారి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి” అంటూ అభ్యర్థిస్తూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగను వేదికగా చేసుకుని ముగ్గుల పోటీలు నిర్వహించడం, వీధి దీపాలు, పైపులైన్ల మరమ్మతులు వంటి పనులపై దృష్టి సారించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Jogulamba Gadwal: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని.. వృద్ధురాలి అంత్యక్రియలు అడ్డగింత..?
అభివృద్ధితో ఎమ్మెల్యే స్పీడ్
ఎన్నికల వేళ వార్డుల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజలు చేశారు. వీటితో పాటు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు చీరల పంపిణీ చేపట్టి, అభివృద్ధి చేసే పార్టీలనే ఆదరించాలని కోరుతున్నారు.
మారుతున్న సమీకరణాలు
వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతంలో ఓడిపోయిన వారు ఈసారి రిజర్వేషన్ కలిసి రావడంతో సానుభూతి పవనాలపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు, తమ వార్డులు రిజర్వ్ కావడంతో కొందరు మాజీ కౌన్సిలర్లు తమకు అనుకూలమైన ఇతర వార్డులపై కన్నేస్తున్నారు. కులాల వారీగా ఓట్ల లెక్కలు వేసుకుంటూ, ప్రత్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థులు తమ గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో తుది ఓటర్ల జాబితా సిద్ధం కావడం, రిజర్వేషన్ల స్పష్టత రావడంతో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Gadwal District: డేంజర్ బెల్స్.. గద్వాల జిల్లాలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. ఇవిగో లెక్కలు..?

