Dr. Jeevan Chandra: ఆచార్యుడు అంటే ద్రోణాచార్యుడు లాంటి గురువులకే గురువు. వైద్యుల భాషలో చెప్పాలంటే డాక్టర్లకే డాక్టర్. ములుగు వైద్య కళాశాలలో మైక్రోబయాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ములుగు జిల్లా(Mulugu District) ముద్దుబిడ్డ డాక్టర్ సకినాల జీవన్ చంద్ర ఎంపికయ్యారు. ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్గా కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. డాక్టర్ జీవన్ చంద్ర ములుగు జిల్లా బండారుపల్లి కి చెందిన మాజీ సర్పంచ్ సకినాల చంద్రం కోమల దంపతుల కుమారుడు.
తండ్రి అడుగుజాడల్లో ప్రాథమిక విద్య ములుగులోని సరస్వతి శిశు మందిర్, అరవింద విద్యా మందిర్, కాకతీయ హైస్కూల్లో పూర్తి చేశారు. మాధ్యమిక విద్యను ములుగు జూనియర్ కళాశాలలో అభ్యసించారు. స్నాతక విద్యను హనుమకొండ లోని చైతన్య డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. అక్కడే మైక్రో బయాలజీ లో గోల్డ్ మెడల్ సాధించారు. చిన్ననాటి నుండి సైన్స్ పట్ల అభిరుచి, ఏదో సాధించాలన్న తపనతో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, అలాగే పీహెచ్డీ మైక్రో బయాలజీ లో పూర్తి చేసి పరిశోధనలో మూడు కొత్త బ్యాక్టీరియాలను గుర్తించారు.
వృత్తి జీవితం
2006లో ములుగు డిగ్రీ కళాశాలలో ఆచార్యునిగా సేవలందించారు. మైక్రో బయాలజీ విభాగాన్ని స్థాపించారు. 2007లో కాకతీయ గవర్నమెంట్ కళాశాలలో చేరారు. 2013 వరకు పరిశోధనలు నిత్యం కృషి చేసి పట్టు సాధించారు. 2017 నుంచి 2024 వరకు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో మైక్రో బయాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా పని చేశారు. సకినాల జీవన్ చంద్ర నేతృత్వంలో ఎనిమిది మంది స్కాలర్లు వివిధ పరిశోధనలో పాల్గొన్నారు. 20 20 లో భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ (డి ఎస్ టి) జీవన్ చంద్రను సౌత్ జోన్ కరువు పరిశోధన ఎవాల్యూవేటర్ గా గుర్తించింది. యు జి సి నోడల్ ఆఫీసర్గా, స్కాలర్షిప్ నోడల్ ఆఫీసర్గా, అకాడమిక్ కౌన్సిల్ సభ్యునిగా, బి ఓ ఓ ఎస్ మెంబర్ గా సేవలు అందించారు.
కొత్త బాధ్యతలు
2025 ఆగస్టులో ములుగు వైద్య కళాశాలలో మైక్రోబయాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ గా, సూపర్డెంట్ డాక్టర్ చంద్రశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మక విధులను డాక్టర్ జీవన్ చంద్ర కి అప్పగించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సి డి సి, నేషనల్ హెల్త్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలను అమలు చేయనున్నారు. తెలంగాణ డయగ్నోస్టిక్స్ కింద జరిగే అన్ని పరీక్షలను ఆయన పర్యవేక్షించనున్నారు. దీంతో ప్రజలకు సురక్షిత, మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
ప్రజల స్పందన
ములుగు జిల్లాకు చెందిన స్థానికుడిగా, మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎంపిక కావడం పట్ల స్థానికులు, సహస్ర ఆచార్యులు, శ్రేయోభిలాషులు విశేష హర్షం వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలకు చేరువగా ఉంటూ హాస్పిటల్లో హానికర సూక్ష్మజీవులను లేకుండా కొత్త విధానంలో ఆసుపత్రి, విభాగాలు అన్ని సంక్షిప్తం చేస్తూ ఏజెన్సీ ప్రాంతంలోని నిరుపేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారని ములుగు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.