ములుగు/మహబూబాబాద్ స్వేచ్ఛ: Warangal News: పశువుల అక్రమ రవాణా, గంజాయి నిర్మూలనకు పోలీస్ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ములుగు డి.ఎస్.పి ఎన్.రవీందర్ పేర్కొన్నారు. ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ పశువుల రవాణా, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నామని డి.ఎస్.పి ఓ ప్రకటనలో రవీందర్ తెలిపారు.
2024 సంవత్సరములో అక్రమంగా పశువులను తరలిస్తున్న వారిపై ములుగు సబ్-డివిజన్ లో 30 కేసులు నమోదు చేసి 296 పశువులను సంరక్షించి గోశాలలకు తరలించామన్నారు. 30 కేసులలో 85 మంది నేరస్తులను అరెస్టు చేశామని వివరించారు. కాగా, ఈ సంవత్సరం 2025 లో జనవరి 1 నుండి నేటి వరకు అక్రమంగా పశువులను తరలిస్తున్న ఒక నేరస్థున్ని అరెస్టు చేసి, కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసులో కేసులో 08 పశువులను సంరక్షించి గోశాలలకు తరలించామని వివరించారు.
Also Read: SLBC Rescue: టన్నెల్ లో ప్రమాదకర పరిస్థితులు.. రంగంలోకి క్యాడవర్ డాగ్స్.. అసలేం జరుగుతుంది?
గంజాయి వంటి మత్తు పదార్థాలకు సంబంధించి ములుగు సబ్-డివిజన్ లో 2024 సంవత్సరంలో మొత్తం 04 కేసులు నమోదు చేసి 1,09,242 విలువ కలిగిన 11.413 కేజీ ల గంజాయిని స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. 04 కేసులలో మొత్తం 09 మంది నేరస్థులు పాల్గొనగా 06గురు నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని వివరించారు. 2025 సంవత్సరం జనవరి నుండి నేటి వరకు 01 కేసు నమోదు చేసి రూ.62,125 విలువైన 2.485 కేజీ ల గంజాయిని స్వాదీనం చేసుకున్నామన్నారు.
ఈ కేసులో మొత్తం ముగ్గురు నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. గంజాయి రహిత సమాజం కోసం ములుగు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. హై స్కూల్ స్థాయి నుండి డిగ్రీ కాలేజీ స్థాయి వరకు ములుగు సబ్-డివిజన్ లో అన్ని గ్రామాల వారీగా గంజాయి నిర్మూలన కోసం “యాంటీ డ్రగ్ వారియర్స్” పేరుతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని అన్నారు. గంజాయి రవాణా, విక్రయాల పైన నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
ములుగు సబ్-డివిజన్ లో డీఎస్పీ స్థాయి నుండి SI స్థాయి వరకు అందరూ పోలీస్ అధికారులు ప్రభుత్వ, ప్రవేటు హైస్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలలో ఉన్న అధ్యాపకుల సహాయంతో అక్కడికి నేరుగా వెళ్లి గంజాయి నిర్మూలన పై విద్యార్థిని, విద్యార్థులలో అనేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కోసం సబ్- డివిజన్, జిల్లా స్థాయిలో యువత కి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.
Also Read: Bayya Sunny Yadav: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌పై కేసు నమోదు
ములుగు సబ్-డివిజన్ పరిధిలో గంజాయి కేసులోఉన్న పాత నేరస్థులపై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగిందన్నారు. నిరంతరం వారిపై నిఘా పెంచడం జరుగుతుంది. ములుగు సబ్-డివిజన్ లో యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలతో అన్ని అనుమానిత ప్రదేశాలలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం నిత్యం తనిఖీలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు హాని కలిగించే గంజాయి, మాదకద్రవ్యాల రవాణా గురించి ఎవరి వద్దనైనా ఖచ్చితమైన సమాచారం ఉంటే పోలీస్ శాఖకు వెంటనే డయల్ 100కి, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి కాల్ చేసి సమాచారం అందజేయాలని కోరారు.