Miryalaguda District: తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ వేయాలని నిర్ణయించడంతో, మిర్యాలగూడను జిల్లాగా చేయాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ‘మినీ హైదరాబాద్’గా గుర్తింపు పొందిన మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఈ ప్రాంత ప్రజలు దశాబ్ద కాలంగా కోరుతున్నారు.
అన్ని అర్హతలున్నా
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైస్ మిల్లింగ్ పరిశ్రమకు నిలయమైన మిర్యాలగూడ, (Miryalaguda) యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులతో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కృష్ణా పరీవాహక నియోజకవర్గాలైన మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్ నగర్ ప్రాంతాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని ఇక్కడి మేధావులు, యువత ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, మిర్యాలగూడకు అవకాశం దక్కకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది.
Also Read: Nalgonda District: నాయకులను విత్ డ్రా చేయించేందుకు.. కీలక నేతలు విఫల యత్నాలు
హామీ.. నెరవేరేనా?
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ‘జిల్లా ఏర్పాటు’ అంశాన్ని ప్రధానంగా చేర్చారు. ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల హద్దుల సవరణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయనున్న తరుణంలో, ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది, శాస్త్రీయ పద్ధతిలో మిర్యాలగూడను జిల్లాగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
సీనియర్ల కృషి అవసరం
ఈ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తే జిల్లా ఏర్పాటు సుగమం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వంటి నేతలు సమిష్టిగా కృషి చేస్తేనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేయగలరని ప్రజలు కోరుతున్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లాను
జిల్లాల పునర్విభజన అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను, గతంలో జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వివరించాను. తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం జిల్లా ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తాను అని ఎమ్మెల్యే, బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.
Also Read: Nalgonda district: కాలుష్యం వెదజల్లుతున్న రైస్‌మిల్లులు.. పట్టించుకొని అధికారులు

