Nalgonda district: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. పరిశ్రమల్లో వినియోగించే నీరు, ధాన్యం వ్యర్థాలతో పరిసరాలు కాలుష్యమయంగా తయారువుతున్నాయి. మిల్లుల్లో కాలం చెల్లిన యంత్రాలు కాలుష్యానికి కారణమవుతున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యంత్రాలు వెదజల్లే పొగతో వాతావరణంలో కార్భన్ డైయాక్సైడ్(Carbon dioxide) మోతాదు ఎక్కువవుతోంది. పరిసరాల్లోని పొలాలపై పొగ, దుమ్మూధూళి పేరుకుపోయి ఎదుగుదల లోపిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో కర్బన ఉద్గారాల పెరుగుదలకు కారణమవుతున్న రైస్ మిల్లుల(Rice Mill)పై మిర్యాలగూడ(Miryalaguda), నాగార్జున సాగర్(Nagarjuna sagar), హుజూర్‌నగర్(Hujunagar), సూర్యాపేట(Surapeta) ప్రాంతాల నుంచి పలుమార్లు కలెక్టర్లకు ఫిర్యాదులు అందాయి.
300లకుపైగా పరిశ్రమలు
ఉమ్మడి నల్లగొండలో 300లకుపైగా రైస్ మిల్లులున్నాయి. వీటిలో మిర్యాలగూడలో 90 పొడి, 12 ఉప్పడు బియ్యం తయారీవి. వీటిలో కేవలం 35 శాతం మిల్లులు మాత్రమే నిబంధనలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలినవి కాలుష్యం వెదజల్లుతున్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు (PCB) నివేదకలు వెల్లడిస్తున్నాయి. ఏడాదిగా నల్లగొండ(Nalgoanda) జిల్లాలో కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు కనీస తనిఖీలు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిల్లుల కారణంగా తాగునీరు, తినే తిండి సైతం కలుషితం అవుతుందని వాపోతున్నారు.
గ్రీన్‌బెల్ట్‌పై పట్టింపేది?
రైస్‌మిల్లు చుట్టూ 10 మీటర్ల వెడల్పుతో గ్రీన్ బెల్ట్(Green Belt) అభివృద్ధి చేస్తూ మొక్కలు నాటి పర్యవేక్షించాలి. కానీ జిల్లాలో ఏ రైస్‌మిల్లు యాజమాన్యం దీన్ని పట్టించుకోవడం లేదు. సామాజిక బాధ్యతగా వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నా ఎక్కడా ఆ ఊసే లేదు. మిల్లుల నుంచి ధాన్యం పొట్టు బయటకు రాకుండా.. రహదారులపై పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా అవేవీ యాజమాన్యాలకు పట్టడం లేదు.
వ్యర్థాల కంపు
పార్‌బాయిల్డ్ రైస్ మిల్లుల్లో బియ్యం ఉడికించిన నీటిని కొన్నిచోట్ల నేరుగా పొలాల్లోకి, చేలల్లోకి విడుదల చేస్తుండడంతో పంట భూములు కంపుకొడుతున్నాయి. వ్యర్థపు నీటిని బహిరంగ ప్రదేశాలు, కాలువలు, పొలాల్లోకి వదలకుండా మిల్లుల్లోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ 90 శాతం మిల్లులకు ఈ వ్యవస్థే లేదు. బాయిలర్ నుంచి వచ్చే బూడిదను నిల్వ చేయడానికి ప్రత్యేక షెడ్లు సైతం ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.
Also Read: CM Revanth Reddy: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ముందస్తు జాగ్రత్తలపై సీఎం కీలక ఆదేశాలు
పంటలపై దుమ్ము
రైస్ మిల్లుల నుంచే వచ్చే దుమ్ము కారణంగా పరిసరాల్లోని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. వరి(Pady)పొలాల్లో దిగుబడి తగ్గి దారుణంగా నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంటే మిల్లులు ఉండడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దుమ్ము, పొట్టు కళ్లలో పడి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వేములపల్లి నుంచి మిర్యాలగూడ(Miryalaguda) శివారు వరకు అద్దంకి-నార్కట్‌పల్లి(Narkat pally) రహదారిపై ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులు హడలిపోతున్నారు.
పెరుగుతున్న శ్వాసకోశ బాధితులు
రైస్‌మిల్లుల దుమ్మూధూళి కారణంగా మిర్యాలగూడ, హాలియా, హుజూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో శ్వాసకోశ(Respiratory system) బాధితుల సంఖ్య పెరుగుతున్నది. మిర్యాలగూడలో గాలి నాణ్యత సైతం తగ్గుతుందని, గాలిలో దుమ్ము కణాలు విపరీతంగా ఉంటున్నాయని స్థానికులు అంటున్నారు.
శాసిస్తున్నఅసోసియేషన్లు
జిల్లాలో కొన్నిచోట్ల రైస్‌మిల్లు అసోసియేషన్లు పాలకులు, అధికారులను శాసించే స్థాయికి చేరారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా వ్యవహరిస్తూ పర్యావరణ నిబంధనలు తుంగలో తొక్కి కోట్లకు పడగెత్తుతున్నారు. అధికారులు తనిఖీలకు వస్తే పైరవీలు, ఒత్తిళ్లు తీసుకొచ్చి బయటపడుతున్నారు. కొన్నిచోట్ల పార్టీల వారీగా విడిపోయి అధికారుల తనిఖీలకు సహరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: DMart Independence Sale: డీమార్ట్ పంద్రాగస్టు ఆఫర్.. సగం ధరకే వస్తువులు.. అస్సలు మిస్ కావొద్దు!