Vakiti Srihari: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మూగజీవాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడానికి సచివాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత క్యాబినెట్‌లో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టడంలో మూగజీవాలు ముందున్నప్పటికీ, వాటికి కనీస రక్షణ కల్పించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నాయన్నారు.
రక్షణకు స్పష్టమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉంది
ఇలాంటి తరుణంలో వాటి రక్షణకు స్పష్టమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని వికృతంగా వాడుకుంటున్నందునే వైపరీత్యాలు సహజంగా మారాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గోవుల రక్షణ కోసం ఇప్పటికే తెలంగాణ గో సంరక్షణ్ పేరిట ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతోందని, మూగ జీవాల విషయంలోనూ ఆలోచించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభిప్రాయపడ్డారు.
మూగజీవాలకు కూడా షెల్టర్ జోన్లను ఏర్పాటు
ఇప్పటివరకు ప్రజల ప్రాణాలు, ఆస్తుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నామని, ఇకపై మూగజీవాలకు కూడా షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసి రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. వరదలను నివారించడానికి చెరువులు, నాలాల పరిరక్షణ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టినట్లు అరవింద్ కుమార్, రంగనాథ్ వివరించారు. ఈ సదస్సులో పశుసంవర్థక శాఖ డైరెక్టర్ బి. గోపి, కేరళ రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం మెంబర్ సెక్రటరీ డా. శేఖర్ ఎల్ కురాయ్కోస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Minister Vakiti Srihari: తెలంగాణ సాదనలో సోనియా గాంధీ మద్దతు కీలకం: మంత్రి వాకిటి శ్రీహరి
