Ponnam Prabhakar: (ఈనెల 3న) హుస్నాబాద్‌లో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనతో హుస్నాబాద్‌లో కొత్త ఉత్సాహం వచ్చిందని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సభకు వస్తున్నారని, ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమావేశమైనప్పటికీ సిద్దిపేట, హనుమకొండ జిల్లాల నుంచి కూడా ప్రజలు హాజరవుతారని తెలిపారు.
2047 విజన్‌తో ముందుకు
ఈ మీటింగ్‌ను విజయవంతం చేయడానికి అందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతోందని మంత్రి తెలిపారు. ‘తెలంగాణలో అభివృద్ధి చేయడానికి కోర్ అర్బన్, రీజియన్, సెమీ అర్బన్ రీజియన్, రూరల్ ఏరియాలుగా విభజించి ప్రత్యేక ప్రణాళికల ద్వారా విజన్‌తో ముందుకెళ్తున్నాం. గతంలో చంద్రబాబు 2020 విజన్‌తో వెళ్ళారు, కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ విజన్ ఇల్లు దాటి రాలేదు. ఇప్పుడు మేము 2047 విజన్‌తో ముందుకు పోతున్నాం.
భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేస్తాం
దేశానికి తెలంగాణ దిక్సూచిలాగా అభివృద్ధి చెందేలా కార్యాచరణ తీసుకుంటాం’ అని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి విద్యా, వ్యవసాయం, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తారని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని మంత్రి చెప్పారు. ఎన్నికల కోడ్ ఇబ్బంది లేకపోతే గౌరవెల్లి భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అగ్రనేత రాహుల్ గాంధీపై హెరాల్డ్ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలవడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ అనుబంధ సంఘాలుగా వ్యవహరిస్తున్న ఈడీ వంటి సంస్థలు వేధింపులకు గురిచేయడంలో దిట్ట అని మంత్రి మండిపడ్డారు.
Also Read: Ponnam Prabhakar: మహిళా సంఘాలకు రూ.304 కోట్లు.. చెక్కులు పంచిన పొన్నం.. ఆపై ఆసక్తికర వ్యాఖ్యలు

