Ponnam Prabhakar: తెలంగాణ మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన 7 మండలాల మహిళలకు హైదరాబాద్ లోని నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెక్కులు అందజేశారు. రూ. 5 కోట్ల 66 లక్షల 16 వేల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళా సాధికారితకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వడ్డీలేని రుణాలు పొందిన మహిళా సంఘాలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం శుభపరిణామమని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనీ ఆకాంక్షించారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.
Also Read: AP New Districts: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. 5 రెవెన్యూ డివిజన్లు.. సీఎం చంద్రబాబు పచ్చజెండా
మహిళా సంఘాల రుణాలకు సంబంధించి వడ్డీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్ఫష్టం చేశారు. 18 సంవత్సరాల పైన మహిళలందరూ మహిళా సంఘాల్లో చేరి ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. మహిళలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందనీ, ప్రజా పాలన ప్రభుత్వం.. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

