Ponnam Prabhakar: వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ లకు ఆదేశించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని గోమాత పత్తి మిల్లులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి, అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమశాతాన్ని పరిశీలించారు. అనంతరం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Also Read: Ponnam Prabhakar: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అస్తవ్యస్తం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
పత్తికి 8,100 మద్దతు ధర ఉంది
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టపాస్ కిసాన్ మొబైల్ యాప్ ఆన్లైన్ ఓటీపీ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుందని, రైతులు ఆ కేంద్రానికి వెళ్లి పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవచ్చన్నారు. తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ లో ప్రారంభించుకున్నమన్నారు. పత్తికి 8,100 మద్దతు ధర ఉందని, ఈసారి భారీ వర్షాలు పడడం వల్ల కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. టపాస్ కిసాన్ యాప్ తో రాజ మార్గం ద్వారా పత్తిని అమ్ముకోవచ్చన్నారు. మొక్క జొన్న కూడా కొనుగోలు చేస్తున్నమని, హుస్నాబాద్ లో మొక్కజొన్న కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నరని తెలిపారు.
లాభాలు ఉండే పంటలు వేయాలి
అన్ని కొనుగోలు కేంద్రాలు రైతులకు వినియోగంలోకి వస్తాయని, నర్మేట లో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, ఇప్పటికే ట్రయల్ రన్ ప్రారంభమైందన్నారు. ఆయిల్ ఫామ్, హార్టికల్చర్ , సెరికల్చర్ పై అవగాహన కలగాలని రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నమని వెల్లడించారు. లాభాలు ఉండే పంటలు వేయాలని, దాని వల్ల అధిక దిగుబడి వచ్చి రైతులకు లాభాలు జరగాలన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని పంట పొలాలకు నీళ్లు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే. హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ లు కంది తిరుపతిరెడ్డి, బోయిని నిర్మల జయరాజ్, వైస్ చైర్మన్ బంక చందు, హుస్నాబాద్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ, సింగల్ విండో కమిటీ డైరెక్టర్లు, రైతులు, నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు .
