Ponnam Prabhakar: అసెంబ్లీలో ఓకే చెప్పి పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తోంది
బీసీ రిజర్వేషన్‌కు తెలంగాణ బీజేపీ నాయకులు మోకాలడ్డుతున్నారు
బీజేపీ నాయకులు రాష్ట్రంలో చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శల దాడి
రాజన్న సిరిసిల్ల, స్వేచ్ఛ: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నాయకులు అసెంబ్లీలో ఓకే చెప్పి పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శించారు. ‘‘బీసీ రిజర్వేషన్‌కు తెలంగాణ బీజేపీ నాయకులు మోకాలడ్డుతున్నారు. బీజేపీ నాయకులకు తెలంగాణలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం వేములవాడలో విధుశేఖర భారతి ధర్మ విజయ యాత్రలో పాల్గొనడానికి వెళ్ళే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులను కలిశారు. అనంతరం మీడియాతో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. శనివారం తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజల సంపూర్ణ సహకారంతో విజయవంతమయిందని అన్నారు.
ప్రజల ఆకాంక్ష రాజకీయ పార్టీల ఏకాభిప్రాయానికి సూచిక అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. రాజ్యాంగంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా లేకపోయినప్పటికీ గతంలో ఈడబ్ల్యూఎస్ విధానంలో 10 శాతం పెంచినట్టు అమలు చేయాలన్నారు. పక్కరాష్ట్రం తమిళనాడులో ఇతర పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సానుకూలంగా స్పందించినట్లు తెలంగాణలో కూడా అమలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్‌పై దుష్ప్రచారాన్ని ఆపాలి: తాటిపల్లి రవీందర్ గుప్తా
హనుమకొండ, స్వేచ్ఛ: దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న రాజ్యాంగ బద్దమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయంగా జరుగుతున్న కుట్రను సాగనివ్వబోమని ఓసీ జేఏసీ జిల్లా స్థాయి సదస్సులో తాటిపల్లి రవీందర్ వ్యాఖ్యానించారు. ఓసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో అగ్రకుల పేదల ఉమ్మడి జిల్లా స్థాయి సదస్సు ఆదివారం బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో అధ్యక్షుడు నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశంలో నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ స్థల దాత, ఆలయ ధర్మకర్త, తాటిపల్లి రవీందర్ గుప్తా మాట్లాడారు. రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య, మార్వాడి, కమ్మ కులాలకు చెందిన సుమారు 500 మంది సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన రాజకీయ పరిణామాలు, ఉద్యోగ, విద్యా రంగాలలో అగ్రవర్ణాలుగా పేర్కొంటున్న ఆరు కులాల విద్యార్థులందరికీ కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని రవీందర్ గుప్తా పేర్కొన్నారు. ఈ కులాల జనాభా 20 శాతం దాటింది కాబట్టి 20 శాతం రిజర్వేషన్లను ఆయా జాతులకు కేటాయించాలని, తాము ఎవరికి వ్యతిరేకం కాదని అన్నారు. తాము ఎవరికీ అనుకూలం కూడా కాదని అన్నారు. ‘‘ మేము ఎంతో మాకు అంత రిజర్వేషన్ కల్పించాలి. మాకు ఉన్న డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసం సమావేశం ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు. సింగిరికొండ మాధవ శంకర్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని, అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ కోటాను సరిగా అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.
