Gadwal Knife Attack: జిల్లా కేంద్రంలోని ఓ ఫోటో స్టూడియోలో మద్యం మత్తులో యువకులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా బయటకు వచ్చి రహదారిపై వీరంగం సృష్టించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం రాత్రి గద్వాల పట్టణం కృష్ణవేణి చౌరస్తాలో గల వంశీ ఫోటో స్టూడియోలో ఈ ఘటన జరిగింది. ఫోటో స్టూడియో నిర్వాహకుడు వంశీతో పాటు స్టూడియోలో పనిచేసే అనిల్, వసంత్, హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న బుల్లెట్ వంశీ, అరవింద్ కలిసి స్టూడియోలో కూర్చుని మద్యం సేవించారు. అర్ధరాత్రి అనిల్ స్టూడియో మూసివేసే తరుణంలో, వారి మధ్య మాటా మాటా పెరిగి కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
Also Read: Bulkapur Nala: మణికొండ బుల్కాపూర్ నాలా మాయం.. ఫిర్యాదులు వచ్చిన స్పందించని అధికారులు
అర్ధరాత్రి దాకా మద్యం
ఈ ఘటనలో వసంత్‌కు తీవ్రంగా గాయపడగా, బుల్లెట్ వంశీ, అర్వింద్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని గద్వాల ఆసుపత్రికి తరలించగా, వసంత్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గద్వాల టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకవచ్చారు. అర్ధరాత్రి దాకా మద్యం సేవించిన అనంతరం స్టూడియో మూసి వేసేందుకు యత్నిస్తున్న తరుణంలో మాటమాట పెరిగి, ఒకరిపై నొకరు కత్తులతో దాడి చేసుకున్నట్లు గద్వాల పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వరకు మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నా, పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై గద్వాల సీఐ టంగుటూరి శ్రీనును వివరణ కోరగా, “మద్యం మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నది వాస్తవమే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు” తెలిపారు.
Also Read: Mahesh Kumar Goud: పంచాయతీ ఎన్నికల్లో సేమ్ ఇదే జరుగుతుంది: మహేష్ కుమార్ గౌడ్

