Bulkapur Nala: నగరం విస్తరిస్తున్న క్రమంలో అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. అధికారుల సహాయ సహకారాలతో అక్రమార్కులు తమకు నచ్చిన విధంగా కబ్జాలు, ఆక్రమణలు చేపడుతున్నారు.. అడిగే వారు లేకపోవడం.. ఎంతో కొంత రాజకీయ పలుకుబడి వెరసి అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్న నగరంలో ఇలాంటి అక్రమాల నీలినీడలు పడుతుండటంతో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది. అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు, నాలాలను వేటిని వదలడం లేదు. దీంతో చివరకు సామాన్యుడే ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నగర శివారులోని మణికొండ మున్సిపాలిటీలో ఇదే తంతు విచ్చలవిడిగా సాగుతుంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బుల్కాపూర్ నాలా కాస్త రోజురోజుకు కుచించుకుపోతుంది. ఓ పేరు మోసిన నిర్మాణ సంస్థ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఏకంగా నాలాను పూడ్చి మరి నిర్మాణాలు చేడుతున్నారు.
సర్వే నెంబర్ 262 బుల్కాపూర్ నాలా
దీంతో నాలా రోజురోజుకు విస్తీర్ణం తగ్గి వెలవెలబోతుంది. ఏకంగా నాలాను పూడ్చి వేసి నిర్మాణాలు సజావుగా నిర్వహించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఆ శాఖ, ఈ శాఖ అన్న భేదాలు ఏమీ లేవు. ఎవరికి అందిన కాడికి వారు ఎంతో కొంత లబ్ధిపొందుతూ అక్రమార్కులకు అన్ని విధాలా సహకరిస్తున్నారని లోగుట్టు.గండిపేట్ మండల పరిధిలోని మణికొండ మున్సిపల్ మణికొండ మర్రిచెట్టు సమీపంలోని సర్వే నెంబర్ 262 బుల్కాపూర్ నాలా ఉంది. బుల్కాపూర్ నాలాను మూసివేసి అమృత కన్స్ట్రక్చన్స్ నిర్మాణదారులు బుల్కాపూర్ నాలాను మూసి నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఈ ఆక్రమణలపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఉందా లేదా అని ప్రజల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇందులో రెవెన్యూ విభాగం పాత్ర ఏ మేరకు ఉందో తెలియాల్సి ఉంది.
Also Read:Bulkapur Nala: కండ్ల ముందే నాలా కబ్జా చేసినా.. పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
నాలాలను విస్తరించేందుకు సిద్ధం
ఏకంగా నాలాను కబ్జా చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందని స్థానిక ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు అధికారుల చేతులు తడుపుతుండటంతోనే ఈ అక్రమాలు సజావుగా సాగుతున్నాయని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారుల మౌనం దేనికీ సంకేతమని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ స్థలాలు, ఇలాంటి నాలాలను కాపాడాల్సిన అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తుంటే ప్రశ్నించాల్సిన అధికార యంత్రాంగం ఎందుకు వేచి చూస్తున్నారని ప్రజలు ఆరా తీస్తున్నారు.
నాలాల బఫర్ జోన్ లో స్థానిక నాయకుల సహకారంతో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం కాలనీలు ముంపుకు గురైన నేపథ్యంలో నాలాలను విస్తరించేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలు కేవలం ప్రాథమిక స్థాయిలోనే నిలిచిపోయాయి. ప్రభుత్వ అనుమతులు రాక విస్తరణ ముందుకు సాగడం లేదు. నిర్మాణాలు కట్టుకోవాలంటే టీఎస్ బీపాస్ లో దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాలి. వీటన్నింటిని దాటుకొని నాలాను ఎలా పూడ్చివేస్తారనే ప్రశ్న వెల్లువెత్తుతుంది. ఇప్పటికైనా రెవెన్యూ విభాగం అధికారులు చొరవ చూపి సదరు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మౌనంగా రెవెన్యూ విభాగం
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ లో నాలా పూడ్చి వేసి నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ విభాగం కనీసం అటు వైపు చూడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం కేవలం తమ స్వలాభం చూసుకుంటూ ఇలాంటి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఏకంగా నాలాను పూడ్చినా మౌనం వహిస్తున్నారని ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. సదరు కన్ స్ట్రక్షన్ సంస్థ నిర్వాహాకులను కట్టడి చేయాల్సింది పోయి తమకేమి పట్టిందిలే అన్న చందంగా వ్యవహరించడమే ప్రజలకు ఆవేదనను కలిగిస్తుంది. రెవెన్యూ అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన సమయంలో మౌనంగా ఉండటాన్ని ఎవరూ హర్షించడం లేదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఇలాంటి అక్రమాలను గుర్తించి ప్రభుత్వ స్థలాలు, నాలాలను సంరక్షించాలని, ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read:Bulkapur Nala: కండ్ల ముందే నాలా కబ్జా చేసినా.. పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు

