Ration Shops: మేడ్చల్ మండలం అత్వెళ్లిలోని నంబర్ వన్ రేషన్ షాపు నిర్వహణ, కేటాయింపుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గత కొన్ని ఏళ్లుగా ఈ షాపునకు నోటిఫికేషన్ ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తుంటే, ఒకే కుటుంబానికి రెండు రేషన్ షాపులు ఎలా కేటాయిస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఒకే కుటుంబం.. రెండు షాపులు
అత్వెళ్లిలోని నంబర్ 1 రేషన్ షాపుతో పాటు, మేడ్చల్‌లోని నంబర్ 22 రేషన్ షాపు కూడా ఒకే కుటుంబం ఆధీనంలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. సాధారణంగా ఏదైనా రేషన్ షాపు ఖాళీ అయినా లేదా ఫిర్యాదులు వచ్చినా తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి కొత్త డీలర్‌ను కేటాయించడం ఆనవాయితీ. కానీ, అత్వెళ్లి షాపు విషయంలో మాత్రం అధికారులు కావాలనే మినహాయింపు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ మండలంలోని మిగతా 37 షాపులకు ఎప్పటికప్పుడు సమీక్షలు, మార్పులు జరుగుతున్నా, ఈ ఒక్క షాపుపైనే అధికారులకు ఎందుకంత ప్రేమ అని స్థానికులు నిలదీస్తున్నారు.
Also Read: Crowd at Ration Shops: మూడు నెలల బియ్యానికి.. ముప్పు తిప్పలు!
నిరుద్యోగులకు అన్యాయం
నియోజకవర్గంలో ఎంతో మంది అర్హులైన నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తుంటే, నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబానికి రెండు షాపులు కట్టబెట్టడం ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మండలంలోని పలు షాపులకు నోటిఫికేషన్ ఇచ్చినా, అత్వెళ్లి నంబర్ 1 షాపు పేరును అందులో చేర్చకపోవడం వెనుక పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నాయన్న అనుమానం వ్యక్తమవుతుంది.
విచారణ జరిపిస్తాం
తాను కొత్తగా బాధ్యతలు చేపట్టానని, ఈ షాపు వివరాలపై పూర్తి అవగాహన లేదు. అత్వెళ్లి రేషన్ షాపు నిర్వహణపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను ఆర్డీవోకు నివేదిస్తాం. అర్హులైన వారికే అవకాశం దక్కేలా చర్యలు తీసుకుంటాం.
– అనూష, డిప్యూటీ ఎమ్మార్వో
Also Read: Telangana: గేరు మార్చిన సర్కార్.. రేవంత్ ‘లోకల్’ ప్లాన్

