Medchal Municipality: మేడ్చల్ మున్సిపాలిటీ(Medchal Municipality) అవినీతికి నిలయమైంది. మున్సిపల్ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా లంచగొండితనం రాజ్యమేలుతోంది. ఏ విభాగాన్ని చూసినా ఏమున్నది అన్నట్లుగా ఆ విభాగంలో అధికారి చేయి తడిపితేనే పని జరుగుతుందని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections) ఆలస్యం కావడంతో అధికారులు, సిబ్బందిదే ఇష్టారాజ్యంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా వారు ఆడిందే ఆటగా సాగుతోంది.
కాంట్రాక్టర్ల బిల్లుల మంజూరులో జాప్యం:
మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పనులు చేయాలంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్(Outsourcing) ఉద్యోగి చేస్తున్న నిర్వాకం అందుకు కారణమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. చేపట్టిన పనులు పూర్తి అయ్యాక బిల్లులు(Bills) మంజూరు విషయంలో కాంట్రాక్టర్ చెప్పిన పర్సెంటేజ్ సదరు ఉద్యోగికి నచ్చకపోతే ఆ ఫైలు కమిషనర్ వద్దకు వెళ్లనీయకుండా కావాలని జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కమిషన్ పర్సెంటేజ్ ఓకే అయితే మాత్రం ఆ కాంట్రాక్టర్ ఫైలు(File)కి వెంటనే నెలల వ్యవధిలో క్లియరెన్స్ వచ్చేస్తోందని పేర్కొంటున్నారు.
Also Read: BRS Party: సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు కసరత్తు!
బిల్లుల విషయమై అడిగితే
కానీ. కొన్ని సంవత్సరాల ముందే చేసిన పనులకు సంబంధించిన బిల్లుల విషయమై అడిగితే మాత్రం తమని ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని ఆందోళనను కాంట్రాక్టర్ల వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న సిబ్బంది పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాంట్రాక్టర్ల బిల్లుల జాప్యం పై మేడ్చల్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ నారాయణ రావును ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.