BRS Party: జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకొని రాబోయే గ్రేటర్ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌కు బూస్ట్ ఇవ్వాలని భావిస్తున్నది. గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు గట్టిపట్టు ఉంది. అయితే, తిరిగి దానిని చాటేందుకు గులాబీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ (Maganti Gopinath) సంస్మరణ సభలను నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఏర్పాటు చేసి క్యాడర్‌ను ఉపఎన్నికలకు సన్నద్ధం చేయబోతున్నది.
అయితే, పార్టీ టికెట్ మాగంటి కుటుంబానికి ఇస్తుందా? లేకుంటే పార్టీలో బలమైన నేతలకు ఇస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. గ్రేటర్ (Hyderabad) హైదరాబాద్‌లో గులాబీ పట్టున్న నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. ఈ నియోజకవర్గంలో బస్తీ ప్రజల ఓటు బ్యాంకు కీలకం. అయితే, ఈ నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2018, 2023లో బీఆర్ఎస్ (BRS) నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
Also Read:Minister Pongileti Srinivasa Reddy: సినిమా డైలాగులతో రెచ్చిపోతున్న బీఆర్ఎస్.. నాయకులు
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గం నుంచి మెజార్టీ కార్పొరేటర్లను బీఆర్ఎస్ (BRS) గెలుచుకున్నది. అయితే, అనారోగ్యంతో మాగంటి చనిపోవడంతో ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఈ సిట్టింగ్ స్థానంను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ (BRS) సన్నద్ధమవుతుంది. చేజారకుండా పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రభుత్వ వైఫల్యాలను సైతం ప్రజల్లో ఎండగట్టడంతో పాటు మాగంటి నియోజకవర్గానికి చేసిన కృషిని వివరించాలని భావిస్తున్నారు.
డివిజన్ల వారీగా సంస్మరణ సభలు
నియోజకవర్గంలోని 7 డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్లలో మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) సంస్మరణ సభలను నిర్వహించేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. నేడు షేక్ పేట డివిజన్ నుంచి సంస్మరణ సభలకు శ్రీకారం చుడుతున్నారు. ఆ బాధ్యతలను ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్,(Dasoju Shravan) పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు పార్టీ అధిష్టానం అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఇరువురు పర్యటనలు చేస్తూ నేతలతోనూ భేటీ అవుతున్నట్లు తెలిసింది. పార్టీ క్యాడర్‌కు తాముంటానే భరోసాను ఇస్తున్నారు.
మాగంటి సునీతకు టికెట్?
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) భార్య (Sunita) సునీతకు ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధిష్టానం ఆమెతో త్వరలోనే సంప్రదింపులు చేయనున్నట్లు సమాచారం. అయితే, ఆమె అంగీకరిస్తే బరిలో నిలిపి గెలిపించుకునే బాధ్యతను పార్టీ అధిష్టానం తీసుకొనున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆమె రాజకీయాల్లోకి రాను అంటే మాత్రం పార్టీలో కీలక నేతలు అయిన పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, (BRS) బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. వీరు కాకుండా ఇంకా కొంతమంది పార్టీలోని సీనియర్ నేతలు సైతం ఈ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం వద్ద విన్నవించుకుంటున్నట్లు సమాచారం. అయితే, విష్ణువర్ధన్ రెడ్డి, లేదా శ్రీధర్ రెడ్డి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
కీలకంగా మారిన ఉప ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందిన లాస్య నందిత కొద్ది నెలలకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఆకుటుంబం నుంచే టికెట్ ఇచ్చారు. అయితే, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలువాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో తమ పార్టీకి పట్టుందని నిరూపించుకునేందుకు జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం బీఆర్ఎస్‌కు అనివార్యమైంది. అయితే, గులాబీ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుందనేది చూడాలి.