Maoists In Karre Gutta: ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం శివారు ఛత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. కేంద్ర కమిటీ మావోయిస్టు నాయకులు కర్రెగుట్టల ప్రాంతంలోని గుహల్లో దాగి ఉన్నారని విశ్వసనీయ సమాచారం మేరకు గత నాలుగు రోజులుగా విస్తృత తనిఖీలు భద్రతా బలగాలు చేపడుతున్నాయి. ఈ మేరకు మావోయిస్టులు సైతం భద్రతా బలగాలకు సవాళ్లు విసురుతూ చిక్కకుండా ఉన్నట్లు తెలుస్తోంది.
నాలుగు రోజులుగా కర్రెగుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో మోహరించినప్పటికీ ఆశించిన స్థాయిలో మావోయిస్టు పోలీసులకు చిక్కడం లేదు. దీంతో భద్రతా బలగాలు ఓవైపు తనిఖీలు నిర్వహిస్తూనే మరోవైపు కూంబింగ్ ఆపరేషన్ను సైతం చేపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సెంట్రల్ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించిన ఓ సమావేశంలో కర్రెగుట్టల ప్రాంతంలో జరిగే కూంబింగ్ లలో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
పూర్తిస్థాయిలో చత్తీస్గడ్ సహ మరో రెండు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ మోహరించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేంద్ర కమిటీ మావోయిస్టు నాయకులు కర్రెగుట్టల ప్రాంతంలోని దాగి ఉన్నారని సమాచారంతో కూంబింగును భద్రతా బలగాలు విస్తృతంగా చేపడుతున్నాయి. ఎట్టకేలకు మావోయిస్టులు చిక్కితే చర్చల ద్వారా సమస్య పోతుందా? లేదంటే ఎదురు దాడికి దిగితే ఎన్కౌంటర్లు జరుగుతాయా అనే ఉత్కంఠతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
Also Read: TG 10th Class Results: తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ .. రిజల్ట్స్ వచ్చేది ఆరోజే!
ఆదివాసి గ్రామాలు నాలుగు ఐదు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నాయి. ఈ స్థాయిలో ఇప్పటివరకు అటు ఛత్తీస్గడ్ రాష్ట్రం కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇలాంటి భారీ స్థాయి కూంబింగ్ నిర్వహించిన దాఖలాలు తక్కువేనంటూ చర్చి సాగుతోంది. మావోయిస్టులు తమకు కావాల్సిన నిత్యవసర అత్యవసర సరుకులను ఇప్పటికే ఎక్కువ మొత్తంలో అరేంజ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
వారికి కర్రెగుట్టల ప్రాంతంలో ఎక్కడెక్కడ తాగునీరు ఇతర అవసరాల కోసం నీళ్లు ఉంటాయో వారికి పూర్తిస్థాయిలో తెలిసే అక్కడ ముఖం వేసినట్లు చర్చ సాగుతోంది. ఇకపోతే భారీగా మోహరించిన భద్రతా బలగాలకు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు, మంచినీటి వసతులు, ఇతరత్రా అత్యవసర వస్తువులను చేర్చుతున్నారు. నిత్యం స్వైర విహారం చేస్తున్న హెలికాప్టర్లతో సంబంధిత ఆదివాసి గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భద్రత బలగాలు సమీప గ్రామ ప్రజలు కర్రెగుటలకు అతి సమీపంలో ఉన్న కొన్ని గ్రామాలను సైతం ఖాళీ చేయించి అటువైపు రావద్దన్నట్టుగా కోరినట్లు తెలుస్తోంది. ఇవన్నీ గమనిస్తే మావోయిస్టులను మట్టుపెట్టే వరకు భద్రత బలగాలు అక్కడ నుంచి కదిలేలా లేవని చర్చ కూడా జరుగుతోంది. తీవ్ర ఎండల నేపథ్యంలో పదుల సంఖ్యలో భద్రత బలగాలు వడదెబ్బకు వడలిపోతున్నట్లుగా తెలుస్తుంది.
Also Read: Silver jubilee celebrations: సమన్వయం కుదరట్లే?.. నేతల మధ్య ఇంకా విభేదాలు!
దాదాపు 15 మంది భద్రత సిబ్బందికి వడదెబ్బ తగలడంతో వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక హెల్త్ సెంటర్లో చికిత్స అందించినట్లు సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇంకా కూడా ఎండల నేపథ్యంలో మరింత భద్రత బలగాలకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకోవడం గమనార్హం.
ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురికి పైగా మృతి చెందినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. మావోయిస్టులు భద్రతా బలగాలకు ఎదురుపడితే ఇంకా ఎంతమంది మృత్యువాత చెందుతారో నని చర్చ సాగుతోంది.