తెలంగాణ: Silver jubilee celebrations: బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. రజోత్సవ వేడుకకు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నప్పటికీ వారి మధ్య విభేదాలు అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఫాం హౌజ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నప్పటికీ నేతలు మాత్రం కలిసిపోవడం లేదు. ఎవరికి వారుగా సొంతంగా ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కేడర్ లో గందగరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కలిసిపోవాల్సిన నేతలు ఎడమోఖం..పెడముఖంతో సాగుతుండటం పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదు.
బీఆర్ఎస్ పార్టీ 25ఏళ్లు అవుతున్న సందర్భంలో ఘనంగా రజోతోత్సవ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. 10లక్షల మందిని తరలించాలని భావిస్తుంది. అందుకోసం ముమ్మరప్రయత్నాలను పార్టీ అధిష్టానం చేస్తుంది. అయితే నేతల మధ్య సమన్వయలోపం, వర్గపోరు తెరమీదకు వస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కలిసిపోయి ఐకమత్యం చాటాల్సిన సమయం. పార్టీని పటిష్టం చేయాల్సిన తరుణం. అయితే నేతల్లో మాత్రం ఆధిపత్య పోరు సభ వేళ బహిర్గతం అవుతుంది.
సభకు సమాచారమే ఇవ్వడం లేదంటూ సొంత పార్టీ నేతలపైనే కొందరు విమర్శలు చేస్తున్నారు. దీంతో పార్టీ ద్వితీయస్థాయి నాయకులు, కేడర్ గందరగోళం పరుస్తుంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందని కొందరు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో పార్టీ ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఈ సమయంలో నేతలు కలిసిపోకపోవడం పార్టీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది.
Also Read: Heatwave in Telangana: అమ్మో ఎండలు.. ఆ 15 జిల్లాలలో డేంజర్.. డేంజర్!
ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోనూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వర్సెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీలుగా నడుస్తుంది. ఏ సమావేశానికి ఆహ్వానించడం లేదని, ఏక పక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని మండిపడుతున్నారు. పార్టీ సమావేశాలు సైతం పిలువడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఉమ్మడి జిల్లాలో ఇన్ చార్జులుగా పనిచేస్తున్నవారు సభ సక్సెస్ పై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం సూర్యాపేట, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గాలు మినహా ఇతర నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించలేదు. నిర్వహించిన సమావేశాలకు సైతం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ కార్పొరేషన్లను, మాజీ ఎమ్మెల్సీలను ఆహ్వానించలేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.
వరంగల్ సభ నిర్వహణ బాధ్యతలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తొలుత అప్పగించారు. ఆ తర్వాత మరో వర్గానికి సభ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో గులాబీ పార్టీలో నేతల మధ్య విభేదాలు తలెత్తాయనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సమావేశానికి దయాకర్ రావు హాజరుకాలేదు. దీంతో కావాలని పార్టీ దూరం పెట్టిందనే ప్రచారం జరుగుతుంది. వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల విషయంలో బీఆర్‌ఎస్‌లో కోల్డ్‌వార్ జరుగుతోంది.
సభకు పాలకుర్తితోపాటు వర్ధన్నపేట ఇన్‌చార్జి బాధ్యతలు కూడా తానే చూసుకుంటానని అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి వర్ధన్నపేట ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని మరో వర్గం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో అక్కడ ఎర్రబెల్లి వర్సెస్ పోచంపల్లిగా మారింది. అంతేకాదు ఎవరి వర్గం నేతలతో వారు సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లోనూ ఆధిపత్య పోరు కొనసాగుతుంది.
అదే విధంగా సభను విజయవంతం చేసేందుకుగాను బీఆర్‌ఎస్ అధిష్ఠానం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే నియోజకవర్గంలో క్యాడర్‌ను సమన్వయం చేయడంలో ఆమె విఫలమయ్యారని ఎమ్మెల్సీ రవీందర్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు గుప్పించారు. ఇలా ఇంకా కొన్ని జిల్లాల్లోనూ నేతల మధ్య సమన్వయం లోపం, అధిప్యత పోరు కొనసాగుతూనే ఉంది.
Also Read: Fake RS 500 Notes: కేంద్రం హెచ్చరిక.. ఫేక్ కరెన్సీ తెగ వచ్చేసిందట.. బీ అలర్ట్
మాజీ మంత్రి హరీష్ రావు తొలుత సభ విజయవంతంపై ఫోకస్ పెట్టారు. సభ నిర్వహణకు స్థలం కోసం భట్టుపల్లి, మామునూరు, ఉనికిచర్ల సమీపంలోపరిశీలించారు. చివరికి ఉనికిచర్లను ఖరారు చేశారు. ఆతర్వాత ఎల్కతుర్తి లో సభ నిర్వహణకు ఫైనల్ చేశారు. దీంతో హరీష్ రావు కొంత నైరాశ్యానికి గురైనట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం సభ జరుగుతున్న స్థల పరిశీలనకు కూడా హరీష్ రావు రాలేదని సమాచారం.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ పార్లమెంట్, హనుమకొండ జిల్లా పరిధిలో ఎల్కతుర్తి ఉండటంతో ఏ ఒక్క జిల్లా నేతల ఆధిపత్యం ఉండకుండా చూశారనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ సభ నేపథ్యంలో పార్టీలోని నేతల మధ్య సమన్వయం లోపం ఎటుదారితీస్తుందో చూడాలి. ఒకవైపు ఎండతీవ్రత, మరోవైపు నేతల మధ్య గ్యాప్ తో సభకు జన సమీకరణపై మల్లగుల్లాలు పడుతున్నారు.