Minister Gaddam Vivek: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా మార్చడంతో పాటు బిజెపి బిఆర్ఎస్ పార్టీలను ఎదుర్కోవడానికి ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుదామని ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ పేర్కొన్నారు. మంత్రిగా ఉమ్మడి, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కరీంనగర్ వెళ్తుండగా గజ్వేల్‌లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఇన్చార్జి తూంకుంట నర్సా రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం తీసుకువద్దామని పేర్కొన్నారు.
బిఆర్ఎస్, బిజెపి పార్టీల చీకటి ఒప్పందాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ శ్రేణులు, నాయకులు సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీల చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దామని, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీలను ఎదుర్కొనేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, భూభారతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద వర్గాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, తెల్ల రేషన్ కార్డుల మంజూరి తదితర అమలుతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.
Also Read: Major Relief for Agri Gold Victims: అగ్రిగోల్డ్ స్కామ్ కేసులో.. కీలక పురోగతి!
నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం
పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని, వారికి స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. త్వరలో ఉమ్మడి జిల్లాలో పర్యటించి పార్టీ శ్రేణుల కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ గజ్వేల్ తూముకుంట నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆంక్షా రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి, గజ్వేల్, కొండపాక, వంటిమామిడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Chamala Kiran on KTR: మా రేవంత్‌ను అంటావా? కేటీఆర్‌పై విరుచుకుపడ్డ ఎంపీ చామల..!