Chamala Kiran on KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ట్విటర్ టిల్లు కేటీఆర్ కు ఇంగ్లీష్ ఫుల్.. సబ్జెక్ట్ నిల్’ అని ఘాటు విమర్శలు చేశారు. పార్ములా ఈ కార్ రేసు కేసులో నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ ప్రస్టేషన్ కు లోనయ్యారని విమర్శించారు. అందుకే లై డిటెక్టర్ అసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ఛాలెంజ్ విసిరారని విమర్శించారు. డ్రగ్స్ కేసులో టెస్ట్ చేసుకోమని రేవంత్ రెడ్డి ఆరోజు ఛాలెంజ్ విసిరితే.. కేటీఆర్ ఎందుకు వెనక్కి పోయారని ప్రశ్నించారు. లై డిటెక్టర్లు పెట్టుకునే కాడికి ఇక కోర్టులు ఎందుకని ప్రశ్నించారు.
అవినీతిపై విచారణ చేయడం తప్పా?
ఫార్మూలా ఈ కారు రేసులో పాలనా అనుమతులు లేకుండా రూ.44 కోట్లు ఎలా తరలించారని ఏసీబీ ప్రశ్నిస్తోందని ఎంపీ చామల అన్నారు. అవినీతిపై ఏజెన్సీలు విచారణ చేయడం తప్పా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ది వెండెట్టా పాలిటిక్స్ అని కేటీఆర్ అంటున్నారని.. హస్తం పార్టీది ప్రజా పాలన అని ఎంపీ స్పష్టం చేశారు. మెున్న తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత (Kavitha).. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇదంతా డ్రామా కంపెనీ అని అర్థమైపోయిందని చెప్పారు. దేవాలయం లాంటి అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడిగా రావాలనే ఆలోచన కేసీఆర్ కు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ప్రభుత్వ విప్ వార్నింగ్
బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ (ACB) తాజా నోటీసుల నేపథ్యంలో విచారణకు వెళ్తానని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే బడాయి కబుర్లు చెపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ నార్కో టెస్ట్ చేయించుకోవాలని కేటీఆర్ సవాల్ విసరడాన్ని ప్రభుత్వ విప్ తీవ్రంగా తప్పుబట్టారు. ముందు మీ తండ్రి, సోదరికి నార్కో టెస్ట్ చేయించాలని అన్నారు. లిక్కర్ స్కామ్ లో కవితకు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో కేటీఆర్ కు నార్కో టెస్ట్ చేయాలని ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ తన మాటలు ఆపకపోతే కాంగ్రెస్ శ్రేణులు ఇక సహించరని హెచ్చరించారు.
Also Read: ISRO – Ax-4 Mission: శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. డేట్ ఫిక్స్ చేసిన ఇస్రో.. ఎప్పుడంటే?
సీఎంకు కేటీఆర్ సవాల్!
సోమవారం విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి? అంటూ సవాలు విసిరారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా సూటిగా ప్రశ్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పదేండ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉందన్నారు. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో, ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? అని సవాల్ విసిరారు.