Thummala Nageswara Rao: ఖమ్మం నగరంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఖమ్మం 9వ డివిజన్ రోటరీనగర్‌లో రూ. 35 లక్షల వ్యయంతో చేపట్టనున్న 400 మీటర్ల సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖమ్మం నగరం గతంతో పోలిస్తే పారిశుధ్యం, మౌలిక సదుపాయాల పరంగా ఎంతో మెరుగుపడిందని పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను కార్పొరేటర్లు వచ్చే నాలుగు నెలల కాలంలోనే పూర్తి చేయించుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా, ప్రజల అవసరాలే ప్రాధాన్యతగా నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. నగరంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై మంత్రి ప్రత్యేకంగా స్పందించారు. రోడ్ల వెడల్పు వల్ల ఆస్తుల విలువ పెరగడమే కాకుండా వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయని తెలిపారు.
Also Read: Thummala Nageswara Rao: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
విద్యుత్ దీపాల ఏర్పాటును పూర్తి చేయాలి
విస్తరణలో ఇళ్లు కోల్పోయే పేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు లేదా స్థలాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కూడా టీడీఆర్ విధానాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సైడ్ డ్రైయిన్లపై ఫుట్‌పాత్‌లు నిర్మించి, విద్యుత్ దీపాల ఏర్పాటును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని రోప్ వే, వెలుగుమట్ల అర్బన్ పార్క్ పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. లకారం ట్యాంక్ బండ్ నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని తక్షణమే పరిశీలించి సరిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ.. 9వ డివిజన్‌లో విద్యుత్ స్తంభాల తరలింపునకు ఇప్పటికే ఎన్‌పీడీసీఎల్‌కు చెల్లింపులు పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, మున్సిపల్ ఇంజినీర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

