Kaloji Narayana Rao University: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మరో తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది. ఇటీవల జరిగిన పీజీ పరీక్షల ఫలితాలు, రీవాల్యుయేషన్ మార్కుల అంశంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో, యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో రికార్డులను పరిశీలించారు. అక్టోబర్ 7 నుండి నవంబర్ 1 వరకు జరిగిన పీజీ పరీక్షల్లో ఫెయిల్ అయిన నలుగురు నుంచి ఐదుగురు విద్యార్థులు డబ్బులు తీసుకొని రీవాల్యుయేషన్‌లో అక్రమంగా పాస్ చేయబడ్డారని తోటి విద్యార్థుల నుంచి విజిలెన్స్ కమిటీకి ఫిర్యాదు అందింది.
Also Read: Fake Cotton Seized: నకిలీ విత్తనాల గ్యాంగ్ పట్టివేత.. మరీ ఇంత మోసమా?
205 మంది ఫెయిల్
ఈ ఫిర్యాదు ఆధారంగానే ఇంటెలిజెన్స్ మరియు విజిలెన్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ తనిఖీలకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, నలుగురు పీజీ విద్యార్థుల రీవాల్యుయేషన్ అంశంపై విచారణ జరుగుతోందని ధృవీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2123 మంది పీజీ విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 205 మంది ఫెయిల్ అయ్యారని, అందులో 155 మంది రీకౌంటింగ్ పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఉత్తీర్ణులు కాలేదని ఆయన వివరించారు. ఈనెల నాలుగో తేదీన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయని, పరీక్ష నిర్వహణ మొత్తం ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుందని, మార్కుల గోల్‌మాల్‌కి అవకాశమే లేదని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆరోపణల నేపథ్యంలో అసలు ఏం జరిగిందో విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు.
వివాదాల సుడిగుండంలో యూనివర్సిటీ
మొదటి నుంచీ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వివాదాల్లో కొనసాగుతుంది. గతంలో పాత ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించడం, ఉద్యోగుల తొలగింపు, వేధింపుల అంశాలతో వివాదంలో ఇరుక్కుంది. తాజాగా పరీక్షా ఫలితాల్లో మార్కుల గోల్‌మాల్ ఆరోపణలు రావడంతో మరోమారు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Kaloji Narayana Rao University: ఫలించిన ‘స్వేచ్ఛ’ కృషి .. వీసీని మార్చిన ప్రభుత్వం
