వరంగల్, స్వేచ్ఛ: Kaloji Narayana Rao University: వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ లో 10 ఏండ్లుగా తిష్ట వేసి యునివర్సిటీ నిర్వహణను బ్రష్టు పట్టించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న గత వీసీ స్థానంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వీసీనీ నియమించింది. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా డాక్టర్ పి.వి.నంద కుమార్ రెడ్డిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.అన్యాయాన్ని ఎదిరించినవాడు నాకు ఆరాధ్యుడు అన్న స్ఫూర్తి ప్రదాత ప్రజా కవి కాళోజీ నారాయణ రావు పేరు పెట్టిన వరంగల్ లోని కాళోజీ హెల్త్ యునివర్సిటీ లో అనేక అవకతవకలు చోటు చేసుకోవడం, 10 సంవత్సరాలుగా నిబంధనలకు విరుద్ధంగా ఒక్కరే వీసీగా కొనసాగుతున్న నేపథ్యంలో *కాళోజీ విశ్వ విద్యాలయం సమస్యల నిలయం* అనే శీర్షికన రాసిన ప్రత్యేక కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త వీసీ నియామకం చేపట్టింది.
వీసీగా బాధ్యతలు చేపట్టిన నంద కుమార్ రెడ్డి
హైదారాబాద్ లోని సరోజినీదేవి ఐ హాస్పిటల్ సూపరిండెంట్ గా పని చేసిన డాక్టర్ పి.వి.నంద కుమార్ రెడ్డిని వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డాక్టర్ పి.వి.నంద కుమార్ రెడ్డి బుధవారం వీసీగా బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజు యునివర్సిటీ పరిసరాలను పరిశీలించారు. అయితే కొత్త వీసీ నియామకం కోసం 2024 జూన్ లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా దీనికోసం 35 మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పదవి కోసం ఆరాట పడ్డ పలువురు ప్రభుత్వ పెద్దల వద్ద బాగానే ఫైరవీలు చేసిన పట్టించుకోకుండ యూనివర్సిటీని సమూలంగా గాడిలో పెట్టాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తుంది.
Also read: Telangana Budget 2025: తెలంగాణ బడ్టెట్.. కేబినేట్ తో సీఎం రేవంత్ కీలక సమావేశం
పేరుకు పోయిన సమస్యలు… అనేక సవాళ్లు
వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో వీసీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పి.వి.నంద కుమార్ రెడ్డికి అనేక సమస్యలు, సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీలో అవసరం మేరకు పోస్టుల భర్తీ లేక నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. యూనివర్సిటీ పరిదిలో సుమారు 350 యూజీ, పీజీ, దంత, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు అనుగుణంగా పోస్టుల భర్తీ లేదు. నలుగురు జాయింట్ రిజిస్ట్రార్స్ అవసరం అండగా ఒక్కరే ఉన్నారు. డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టు ఖాళీ అయిన తిరిగి భర్తీ చేయలేదు. నిర్వహణకు అవసరమైన అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి.
సమూలంగా సంస్కరిస్తేనే విజయం సాధిస్తారు
వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో నిర్వహణలో ఇంతకాలం అనేక లోపాల కారణంగా యునివర్సిటీకి మచ్చ తెచ్చేలా వ్యవహరించారు. నిత్యం అనేక వివాదాలతో చర్చనీయాంశంగా మారింది. అనర్హులను బాధ్యులుగా నియమించడం కారణంగా పరీక్షల నిర్వహణలో లోపాలు జరిగాయి. సీట్ల భర్తీ విషయంలోనూ నిత్యం వివాదాలు, ఆందోళనలు జరిగాయి. పరీక్షల నిర్వహణ విభాగంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పోస్టులో ఎంబీబీఎస్ చేసిన వారు ఉండాల్సి ఉండగా ఓ దంత వైద్యున్ని ఎగ్జామినర్ గా నియమించి డిప్యూటేషన్ పై కొనసాగిస్తుండడం అనేక విమర్శలకు తావిస్తుంది.
పరీక్షల నిర్వహణ అనేక ఎంత అధ్వానంగా ఉంది అంటే 2025 లో నిర్వహించిన పీజీ పరీక్షకు 2023 సంవత్సరంలో పరీక్ష నిర్వహించిన పాత ప్రశ్న పత్రంతో పరీక్ష నిర్వహించి విమర్శలపాలు అయ్యారు. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్య ‘ప్రాక్టికల్’ పరీక్షలు, రాత(థియరీ) పరీక్షల్లోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి.
Also read: Viral News: తెలంగాణలో వింత పరిస్థితి.. అసలు విషయం తెలిస్తే.. ఔరా ఔరా అనాల్సిందే..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కనీసం సమస్య వస్తే పరిష్కరించుకునేందుకు ఎవర్ని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం సమాచారం ఇచ్చేవారు ఉండరూ, టోల్ ఫ్రీ నెంబర్లు సరిగా పనిచేయవని వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వీసీ సమస్యలను పరిష్కరించడంతోపాటు యూనివర్సిటీలోని లోపాలను గుర్తించి అన్ని విభాగాల్లో సమూలంగా సంస్కరించి నిర్వాహన మెరుగుపరిచి కాళోజీ హెల్త్ యునివర్సిటీ ప్రతిష్టను కాపాడాలని విద్యార్థులు, విద్యాభిమానులు కోరుతున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఇక్కడ క్లిక్ చేయండి
