Jogulamba Gadwal district: జోగులాంబ గద్వాల జిల్లాలో కొందరు ఎరువుల వ్యాపారుల దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. యూరియా(Urea), డి ఏ పి(DAP) కొరతను సాకుగా చూపుతూ రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా లేని ఎరువుల కొరతలు ఈసారి యూరియా, డి ఏ పి రకాల ఎరువుల కొరత ఏర్పడడంతో.. పీఏసీఎస్(PACS) లలో ఒక్కో రైతుకు ఒకటి, రెండు బస్తాలే ఇస్తున్నారు. దీంతో రైతులు ఆగ్రో కేంద్రాలు,వ్యాపారులను ఆశ్రయిస్తుండగా యూరియా, డి ఏ పి కావాలంటే ఇతర ఎరువులు, గుళికలు, పురుగు మందులు అంటగడుతున్నారు. ఇంకొందరు బినామీల ఇళ్లలో యూరియా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి.
అధిక ధరలతో అమ్మకాలు
అధిక ధర.. ఆపై ఇతర మందులుయూరియా బస్తా ఎమ్మార్పీ రూ.266 కాగా రూ.310గా పలువురు వ్యాపారులు అమ్ముతున్నారు. ఇదికాక రూ.500 నుంచి రూ.600 ధర ఉన్న బయో ఫెర్టిలైజర్ బస్తాను రూ.900కు అంటగడుతున్నారు. ఇంకొందరు పంటకు మంచిదని అధిక లాభాలు వచ్చే కొత్తరకం పురుగు మందులను బలవంతంగా అంటగడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నెపాన్ని కంపెనీల పైకి నెడుతుండడం గమనార్హం. ఇటీవల మల్దకల్ ఆగ్రో సెంటర్ లో డి ఏ పి(DAP) ని అడగగా రైతులకు కావాల్సిన రకం కు బదులు ఇతర రకాన్ని సూచిస్తూ గుళికలు కొనాలని మెలిక పెట్టినట్టు ఓ రైతు వాపోయాడు. అయినా యూరియా కొరతతో రైతులు చేసేదేం లేక వ్యాపారులు చెప్పినట్లు కొనుగోలు చేస్తున్నారు.
Also Read: R&B vs Finance Dept: రాష్ట్రంలో రెండు శాఖల మధ్య పైసల వార్.. కొలిక్కి వచ్చేనా..?
రాయచూర్ కి తరలుతున్న యూరియ
ఇటీవల కర్ణాటక(Karnataka) సరిహద్దు బోర్డర్ అయిన నందిన్నె చెక్ పోస్ట్ సమీపంలో ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. ఒక్క జూలై నెలలోనే జిల్లాలో 11,500 మెట్రిక్ టన్నుల యూరియాను అమ్మినట్లు అధికారులు చెబుతున్నడంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కర్ణాటక సరిహద్దు మండలాలైన గట్టు, కేటి దొడ్డి మండలాలలో వ్యాపారులకు సరఫరా అయ్యే యూరియాను బినామీల ఇళ్లలో నిల్వ చేస్తున్నారన్న విమర్శ ప్రజలనుంచి వస్తోంది . రైతులెవరైనా షాప్ నకు యూరియా కోసం వెళ్తే తమ వద్ద లేదంటూ బినామీల వద్దకు పంపిస్తున్నారని సమాచారం. అక్కడకు వెళ్తే యూరియా బస్తాను రూ.400కు అమ్ముతుండడం గమనార్హం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో యూరియా స్టాక్ సరిపడినంత లేకపోవడంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వచ్చే అరకొర స్టాకు తో రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చిన స్టాక్ ఒక రోజుకి అయిపోవడంతో రైతులు వ్యవసాయ పనులు మానుకొని కార్యాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. వారికి ఒకటి, రెండు బస్తాలే ఇస్తుండడంతో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.
