దక్షిణ డిస్కం పరిధిలో..
280 ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ
భారీగా ప్రవహిస్తున్న నదుల్లోకి దిగి మరమ్మతులు
TG Rains Effect: రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద కారణంగా పలు సబ్ స్టేషన్లలో నీరు చేరడం, విద్యుత్ స్తంభాలు (electricity poles) దెబ్బతినడం వలన పలు గ్రామాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ స్తంభించింది. కాగా ఎస్పీడీసీఎల్ సిబ్బంది జోరు వాన, భారీ వరదను సైతం లెక్కజేయకుండా నదులు ఈదుకుంటూ విద్యుత్ స్తంభాలు ఎక్కి మరీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా వరద ప్రభావానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 33 కేవీ ఫీడర్స్ 39, 11 కేవీ ఫీడర్స్ 296, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు 280, మొత్తం 1357 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, వరద ఇంకా కొనసాగుతుండటం వల్ల నష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాల స్వామి.. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీకి తెలియజేశారు.
ఈ నేపథ్యంలో ముషారఫ్ ఫరూఖీ.. సంస్థ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. వర్షం ప్రభావంతో మెదక్ జిల్లాలో విద్యుత్ శాఖకు భారీస్థాయిలో నష్టం జరిగిందని అధికారులు సీఎండీకి తెలియజేశారు. మెదక్ జిల్లాలో వరద ప్రభావానికి కొన్ని చోట్ల సబ్ స్టేషన్లలో నీళ్లు చేరాయన్నారు. 33 కేవి ఫీడర్లు 11, 11 కేవీ ఫీడర్స్ 175, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్లు 262, విద్యుత్ స్తంభాలు 971 దెబ్బతిన్నాయని, కొన్ని వందల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ చెడిపోయిందని అధికారులు సీఎండీకి వివరించారు. మెదక్ జిల్లాతో పాటు, నల్లగొండ, గద్వాల్, యాదాద్రి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల పరిధిలో కూడా నష్టం జరిగిందని వారు సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు.
Also Read- Shilpa Shirodkar: సుధీర్ బాబు ‘జటాధర’లో నమ్రత శిరోద్కర్ సోదరి.. ఫస్ట్ లుక్‌తోనే వణికిస్తుందిగా!
కాగా భారీ వర్షాల వేళ (TG Rains Effect), పండుగ రోజు కూడా మొత్తం విద్యుత్ అధికారులు సిబ్బంది పని చేశారని, భారీ వరద ప్రభావంతో మెదక్ జిల్లాల్లో 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, సిబ్బంది అహర్నిశలు కృషిచేసి బుధవారం రాత్రి వరకు 10 గ్రామాల్లో సరఫరా పునరుద్ధరించినట్లు ముషారఫ్ పరూఖీ తెలిపారు. భారీ వర్షానికి తోడు, రహదారులు కూడా పూర్తిగా దెబ్బతినడంతో మిగిలిన గ్రామాల్లో బుధవారం రాత్రి సరఫరా పునరుద్ధరించలేకపోయామని, గురువారం తమ సిబ్బంది రాజీపేట గ్రామంలో ఉన్న నదిలోకి దిగి ఫీడర్ మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. యావత్ విద్యుత్ సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండి, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులను అతి తక్కువ సమయంలో చేపట్టామని సీఎండీ తెలిపారు. పునరుద్ధణ చర్యల్లో భాగంగా సిబ్బంది భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు