Panchayat Elections: జోగులాంబ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం విస్తృత భద్రత ఏర్పాట్లు చేపడుతోంది. సరిహద్దు రాష్ట్రాల ప్రధాన రహదారుల గుండా 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. విరివిగా వాహనాల తనిఖీలను చేపడుతున్నారు. జిల్లాలో మొత్తం 255 గ్రామపంచాయతీ ఉండగా వాటిలో 143 గ్రామాలు సాధారణంగా పరిగణలోకి తీసుకుంటుండగా 112 గ్రామాలను సమస్యాత్మక జీపీలుగా గుర్తించారు. ఏ గ్రామాల్లో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు, రిజర్వ్ ఫోర్స్ బలగాలు, నిఘా టీమ్ లను సిద్ధం చేశారు.
వివిధ విభాగాల ద్వారా పర్యవేక్షణ
ఎన్నికల పారదర్శకతను కాపాడడంలో భాగంగా వెబ్ క్యాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, స్వతంత్ర అబ్జర్వర్ల పర్యవేక్షణ చేపడుతున్నారు. గ్రామాల్లో అల్లర్లలకు తావివ్వకుండా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పెద్దలు,మహిళా సంఘాలు, యువజన సంఘాలను కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. సున్నితమైన గ్రామాలలో పోలీస్ పహార, రాత్రి వేళల్లో పెట్రోలింగ్,తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో లైసెన్స్ కలిగిన వ్యక్తుల వద్ద ఉన్న తుపాకులను ముందస్తు చర్యగా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పాత క్రిమినల్ కేసులు ఉన్నవారు, గుడుంబా తయారీ, బెల్టు షాపుల నిర్వాహకులు, కాంప్లికేటెడ్ హిస్టరీ కలిగిన వారిని తహసిల్దార్ల సమక్షంలో బైండోవర్ చేశారు. ఎన్నికల సమయంలో యంత్రాంగానికి ఎటువంటి ఆటంకం ఎదురుకాకుండా పోలీస్ శాఖ వారికి కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: Panchayat Elections: రాష్ట్రంలో నేడు తొలి విడత ప్రచారం సమాప్తం.. ఇక మిగిలింది..!
మూడు విడతల్లో
జిల్లావ్యాప్తంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి విడతకు ప్రత్యేక భద్రత బలగాల కేటాయింపు, సెక్టార్ మొబైల్ పార్టీలు, రూట్ మ్యాప్ లు సిద్ధం చేశారు.జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పి శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కసరత్తు చేస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థాయి అధికారులు, పోలీస్, జిల్లా ఉన్నతాధికారులు కలిసి ఎన్నికలు సజావుగా జరిగేలా ముందస్తుగా శాంతిభద్రతలపై దృష్టి పెడుతున్నారు.
పోలీసులు వాహనాల తనిఖీలు
గద్వాల అలంపూర్ చెక్ పోస్టుల పరిధిలో రాత్రులలో సైతం కేసులు పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద రవాణాపై కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అక్రమ చలామణి అయ్యే మద్యం, డబ్బు తరలింపు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు.జిల్లా స్థాయి మానిటరింగ్ వ్యవస్థల ద్వారా పోలింగ్ కేంద్రాలన్నింటిని నిరంతరం పర్యవేక్షణ ఉంచి ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే స్పందించే విధంగా యంత్రాంగం సిద్ధంగా ఉండనుంది. గ్రామాలలో పోలింగ్ కు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే అధికారులకు బాధ్యతలు అప్పగించగా పోలీస్ లుకేంద్రాల వారిగా రూట్ మ్యాప్ లో సిద్ధం చేశారు. ఇప్పటికే తొలి విడతలో భాగంగా సిబ్బంది గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయగా పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన సున్నిత కేంద్రాల్లో అదనపు భద్రత సిబ్బందిని కేటాయించారు.
నిరంతరం నిఘా పటిష్టం : జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ యంత్రాంగం బందోబస్తుకు ప్రతిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై పర్యవేక్షణ చేస్తున్నాం. ఎన్నికల రోజున ఏ చిన్న సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపట్టాం. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మొత్తం యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా ఏర్పాట్లు చేశాం.
Also Read: Panchayat Elections: రాష్ట్ర రాజకీయం వేరు గ్రామం వేరు.. పొత్తులతో పరేషాన్ అవుతున్న నాయకులు

