Panchayat Elections: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలి విడుత ప్రచారం నేటితో ముగుస్తున్నది. పోలింగ్ ఈ నెల 11న జరుగనున్నది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. తొలి విడుతలో 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడుతలో మొత్తం 37,440 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 149 వార్డులకు నామినేషన్లు రాలేదు. 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. మొదటి విడుతలో మొత్తం 56,19,430 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో పురుషులు 27,41,070 మంది ఉంటే, మహిళలు 28,78,159 మంది, ఇతరులు 201 మంది ఉన్నారు. వీరికోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రెండు, మూడు విడుతల వివరాలు
రెండో విడుతలో అత్యధికంగా 193 మండలాల్లో 4,331 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 57,22,665 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 27,96,006 మంది, మహిళలు 29,26,506 మంది ఇతరులు 153 మంది ఉన్నారు. మూడో విడుతలో 182 మండలాల్లో 4,157 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. 53,06,401 ఓటర్లు ఉన్నారు. పురుషులు 26,01,861, మహిళలు 27,04,394, ఇతరులు 146 మంది ఉన్నారు. వీరికోసం 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Also Read: Nepali Gang: రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో 23 తులాల బంగారం దోపిడీ
ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా..
పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,12,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటి విడుతలో 37,562 స్టేషన్లు, రెండో విడుతలో అత్యధికంగా 38,337, మూడో విడుతలో 36,483 స్టేషన్లను సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,723 గ్రామ పంచాయతీలు, 564 మండలాల్లో మొత్తం 1,66,48,496 ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 81,38,937 మంది, మహిళా ఓటర్లు 85,09,059 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 3.70 లక్షల మంది ఎక్కువ ఉన్నారని, ఇతరులు 500 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
మెజార్టీ స్థానాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫోకస్
తొలి విడుత ప్రచారం ముగుస్తుండడంతో మెజార్టీ స్థానాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఎక్కువ స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే రెండు, మూడు విడుతలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయం కోసం స్థానిక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. ప్రతి ఓటర్‌ను పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కుల సమీకరణలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లిన వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో నేతలు దృష్టి సారించారు. రాకపోకల ఖర్చును సైతం భరిస్తామంటూ ఫోన్లు సైతం చేస్తున్నారు. తమకు ఫలానా గుర్తు వచ్చింది వేయాలని అభ్యర్థిస్తున్నారు. సమయం తక్కువగా ఉండడంతో ప్రచారం ముమ్మరం చేశారు.
Also Read: Suryapet Police: సూర్యాపేటలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్.. 12 లక్షల మోసం బట్టబయలు!

