Nepali Gang: నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ సభ్యులను (Nepali Gang) నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం నాడు కార్ఖానా పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఈ మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గన్ రాక్ ఎన్‌క్లేవ్‌కు చెందిన డీకే. గిరి ఆర్మీలో కెప్టెన్ గా పని చేసి రిటైరయ్యారు. కొంతకాలంక్రితం ఆయన తన ఇంట్లో పని చేయటానికి నేపాలీ దంపతులను చూసి పెట్టాలని రాజ్ బీర్ కంపెనీ వర్గాలను సంప్రదించారు. ఈ క్రమంలో కంపెనీకి చెందిన వారు పని చేయటానికి ఎవరైనా నేపాలీ భార్యాభర్తలు ఉంటే చెప్పాలని మహేంద్ర షాహీ, ఉపేంద్ర షాహీలను అడిగారు. ఆర్మీలో కెప్టెన్‌గా పని చేసి రిటైరైన వ్యక్తి ఇంట్లో పని చేయాల్సి ఉంటుందని చెప్పారు.
అప్పుడే పథకం…
అప్పుడే మహేంద్ర షాహీ, ఉపేంద్ర షాహీలు దోపిడీకి పథకం వేశారు. ఈ క్రమంలో కర్ణాటకలో ఉన్న రాజేంద్ర షాహీ, ముంబయిలో పని చేస్తున్న రేఖాదేవి రవాల్‌కు ఫోన్లు చేశారు. విషయం చెప్పి ఇద్దరిని నగరానికి పిలిపించుకుని రాజ్ బీర్ కంపెనీ ద్వారా గిరి ఇంట్లో అక్టోబర్ 21న పనికి కుదిర్చారు. ఆ తరువాత మహేంద్ర షాహీ, ఉపేంద్ర షాహీ వారి సహచరులైన నేత్రా షాహీ, సురేంద్ర సింగ్, గోర్కే, బీరేంద్ర షాహీ, ఉమేశ్ షాహీ, మహేశ్ సునార్, అమిత్, సుభాష్‌లు కూడా హైదరాబాద్ వచ్చి టోలీచౌకీలో ఉంటున్న పూరన్ సింగ్ ఇంట్లో కలిశారు. దోపిడీకి పూర్తి స్థాయిలో పథకం వేసుకున్నారు.
Read Also- YS Sharmila: కర్త మోదీ.. కర్మ చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై షర్మిల విమర్శనాస్త్రాలు
నవంబర్ 15న అర్ధరాత్రి…
ఇక, నవంబర్ 15న అర్ధరాత్రి దాటిన తరువాత అంతా కలిసి గిరి ఇంటి వద్దకు చేరుకున్నారు. సహచరుల కోసం రాజేంద్ర షాహీ, రేఖాదేవిలు తలుపులు తెరిచి పెట్టారు. దాంతో తేలికగానే ఇంట్లోకి ప్రవేశించిన గ్యాంగ్ సభ్యులు ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న గిరిపై మొదట దాడి చేసి కొట్టారు. ఆ తరువాత కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కాళ్లూచేతులు కట్టేశారు. అనంతరం బీరువాలో దాచి పెట్టిన 23 తులాల బంగారు నగలు, 95వేల రూపాయల నగదును దోచుకుని ఉడాయించారు. ఆ తరువాత సొత్తును పంచుకున్నారు. మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసి ఎవరికి వారుగా విడిపోయి వేర్వేరు రాష్ట్రాలకు ఉడాయించారు. మరుసటి రోజు ఉదయం ఇరుగుపొరుగు సహాయంతో కట్లు విప్పించుకున్న గిరి కార్ఖానా పోలీసులకు జరిగిన దోపిడీపై ఫిర్యాదు చేశారు.
ప్రత్యేక బృందాలు…
సంచలనం సృష్టించిన ఈ దోపిడీ కేసులో నిందితులను పట్టుకోవటానికి నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. తిరుమలగిరి ఏసీపీ రమేశ్ పర్యవేక్షణలో కార్ఖానా సీఐ అనురాధ, డీఐలు రంగారెడ్డి, రాజశేఖర్, ఎస్ఐలు సాయినాథ్ రెడ్డి, జ్ఞానదీప్, మహబూబ్ భాషా, అశోక్ రెడ్డిలు వేర్వేరు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం వేటను ప్రారంభించారు. వేర్వేరు రాష్ట్రాల్లో సైతం గాలింపు జరిపారు. ఈ క్రమంలో దోపిడీకి పాల్పడ్డ గ్యాంగులోని రాజ్ బహదూర్ షాహీ (36), మహేంద్ర బహదూర్ షాహీ (39), గోర్ఖే (40), అమిత్ బిసుకర్మ (22), సుభాష్ తమాటా (19)లను సోమవారం అరెస్ట్ చేశారు. నిందితులంతా వాచ్ మెన్లుగా పని చేస్తుండటం గమనార్హం. కాగా, రేఖాదేవి, ఉమేశ్ షాహీ, ఉపేంద్ర షాహీ, మహేశ్ సునార్, సురేశ్ సింగ్, నేత్రా షాహీ, ప్రేం సింగ్, బిరేందర్ షాహీలు పరారీలో ఉన్నట్టు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ చెప్పారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి ఏడున్నర తులాల బంగారు నగలు, రెండు తులాల వెండి ఆభరణాలు, రోలెక్స్ రిస్ట్ వాచీ, 43వేల నగదు, అయిదు మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్టు చెప్పారు.

