Panchayat Elections: పంచాయితీ ఎన్నికల్లో పొత్తులు రాజకీయ నాయకులకు షాక్‌ను ఇస్తున్నాయి. రాష్ట్ర పొత్తులతో సంబంధం లేకుండా స్థానిక ఎన్నికల్లో అలయెన్స్‌లు జరుగుతున్నాయి. గ్రామాల్లో పొంతన లేని విధంగా అభ్యర్థుల మధ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. స్థానిక పరిస్థితులు ఆధారంగా కాంగ్రెస్(Congress), టీడీపీ(TDP), బీజేపీ(BJP), బీఆర్‌ఎస్(BRS), కమ్యూనిస్టు పార్టీల మధ్య డిఫరెంట్ స్టైల్‌లో అగ్రిమెంట్లు జరగడం విశేషం. పార్టీ సింబల్స్ లేకపోయినా, సమన్వయంగా పనిచేసేందుకు లీడర్లు ముందస్తుగానే పరస్పర సహకారాలకు జై కొడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బద్ధ శత్రువులుగా తలపడిన పార్టీలే, గ్రామాల్లో మాత్రం లోపాయికారీ ఒప్పందాలతో ముందుకు సాగుతుండటం ఆశ్చర్యకరం.
స్థానిక పరిస్థితులే సుప్రీం
సాధారణ ఎన్నికల్లో పొత్తులు పార్టీ అధిష్టానాల స్థాయిలో నిర్ణయించబడతాయి. కానీ పంచాయతీ పోరులో మాత్రం గ్రామ పరిస్థితులే సుప్రీం. ఒక గ్రామంలో బలమైన సామాజిక వర్గాన్ని ఎదుర్కోవడానికి లేదా ఏళ్ల తరబడి ఉన్న కుటుంబ వైషమ్యాలను తీర్చుకోవడానికి, రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా పొత్తులు కుదురుతున్నాయి. కొన్ని చోట్ల రాష్ట్ర స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు, గ్రామాల్లో మాత్రం బద్ధ శత్రువులుగా తలపడుతున్నాయి. మరికొన్ని చోట్ల రాష్ట్ర స్థాయిలో బద్ధ శత్రువులుగా ఉన్న ప్రధాన పార్టీల కేడర్, స్థానిక అవసరాల కోసం చేతులు కలుపుతున్నారు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. అంటే పార్టీ గుర్తులేవీ బ్యాలెట్ పేపర్ మీద ఉండవు. ఇదే ఇప్పుడు స్థానిక నాయకులకు వరంగా మారింది. పార్టీ సింబల్ లేనందున వేరే పార్టీ మద్దతుదారుడికి ఓటు వేయమని చెప్పడం నాయకులకు సులువుగా మారింది. ‘మా వార్డులో మీకు సపోర్ట్ చేస్తాం.. సర్పంచ్ సీటుకి మాకు హెల్ప్ చేయండి’ అనే తరహాలో ఓట్ల మార్పిడి జరుగుతోంది.
Also Read: New Year Drugs Supply: న్యూఇయర్ వేడుకలకు డ్రగ్స్ సిద్ధం చేసి.. అడ్డంగా దొరికారు.. వాటి విలువ ఎంతంటే?
భవిష్యత్తుపై చర్చ
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఒకే రకమైన రాజకీయ సమీకరణం ఉంటుంది. కానీ, పంచాయతీ ఎన్నికల్లోని పరిస్థితి మాత్రం గ్రామానికో తీరుగా ఉంటుంది. ఒక గ్రామంలో కులం ఆధారంగా పొత్తు ఉంటే, పక్క గ్రామంలో వ్యక్తిగత ఆధిపత్యం కోసం పొత్తు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీకి, పంచాయతీలో గెలిచే వర్గానికి సంబంధం లేని వింత పరిస్థితులు కూడా అనేక గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్రామీణ పొత్తుల తంతు పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. భవిష్యత్తులో రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఈ పంచాయతీ పొత్తులు ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది ప్రశ్నార్థకం.
ఒక్కొక్క దగ్గర ఒక్కోలా..
కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే ఒక గ్రామ పంచాయితీలో అన్ని పార్టీలు ఏకమై సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత అన్ని పార్టీలకు జై కొడుతూ ఆ పార్టీ జెండాలతో ర్యాలీలు తీసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తుంగతుర్తి నియోజకవర్గంలో కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం కాగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తులతో సర్పంచ్, వార్డుల్లో ఒప్పందాల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని మెజార్టీ పంచాయతీల్లో బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు పొత్తులు పెట్టుకొని అభ్యర్థులను రంగంలోకి దించడం గమనార్హం. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌తో అలయెన్స్‌లో ఉన్నా, గ్రౌండ్ లెవల్‌లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం చర్చనీయమైంది.

