Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంగా సాగుతున్న ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్టు (Sitarama project) నిర్మాణం ఇప్పుడు అక్రమార్కులకు కాసులు కురిపించే సాధనంగా మారింది. అనుమతులు లేకుండానే ఇక్కడ భారీ ఎత్తున కంకర దందా యథేచ్ఛగా సాగుతుందని, దీనిపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త కర్నే బాబురావు డిమాండ్ చేశారు.
Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్
అక్రమ వ్యాపార సామ్రాజ్యం..
“సీతా ‘రామ సాక్షిగా’ కంకర దందా”, “వంకర పనులకే.. ఆయన అండ ‘దండలు'” అన్నట్లుగా మండల కేంద్రంలో కంకర మాఫియా రెచ్చిపోతుంది. ప్రాజెక్టు భూములనే అడ్డాగా మార్చుకొని ఓ అక్రమార్కుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడని కర్నే బాబురావు ఆరోపించారు. “నోబిల్.. నో పర్మిషన్” అన్న చందంగా అనుమతులు లేకుండానే క్రషర్ మిల్లులు పనిచేస్తున్నాయని, దీనిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తుంది.
నిలువు దోపిడీ..
సీతారామ ప్రాజెక్టు (Sitarama project) కాలువల తవ్వకాల్లో వెలువడిన రాళ్లను రాత్రికి రాత్రే అక్రమంగా క్రషర్ మిల్లులకు తరలించి, నాసిరకం కంకరను తయారు చేస్తున్నారని బాబురావు వెల్లడించారు. ఫారెస్ట్, రెవెన్యూ భూములను సైతం అడ్డాగా చేసుకుని ఈ క్రషర్ మిల్లులను ఏర్పాటు చేశారని, తద్వారా ఓ బడా వ్యాపారి అక్రమంగా మైనింగ్ దందాకు తెరలేపాడని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ, మరోవైపు ప్రభుత్వ భూముల్లోనే పాగా వేసి నాసిరకం కంకర ద్వారా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అనుమతులు లేని క్రషర్ మిల్లుల ఏర్పాటు వెనుక కొందరు అధికారుల హస్తం ఉందనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ పనుల నాణ్యతకు ముప్పు..
ప్రాజెక్టు కాలువల నిర్మాణంలో లభించిన కంకర రాళ్లను లారీల ద్వారా దొంగచాటుగా తమ క్రషర్ మిల్లులకు తరలించి, నాసిరకం కంకరను తయారుచేసి, నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ అభివృద్ధి పనులకు చేపట్టిన కాంట్రాక్టర్లకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారని బాబురావు వివరించారు. దీనివల్ల ఆ వ్యాపారి అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తాడని ఆయన ఆరోపించారు. అయితే, నాసిరకం కంకర వినియోగంతో పలు ప్రభుత్వ భవనాలు, సీసీ రోడ్లలో బీటలు ఏర్పడుతున్నాయని, ఇది ప్రజాధనంతో చేపట్టిన పనుల నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించాలి..
“మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం” అంటూ ప్రస్తుత పరిస్థితిపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ క్రషర్ మిల్లుపై కఠిన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, ప్రజా పనుల నాణ్యత దెబ్బతినకుండా చూడాలని కర్నే బాబురావు డిమాండ్ చేశారు.
Also Read: MLA Satyanarayana: కోటి మంది మహిళలను.. కోటీశ్వరులను చేయడమే లక్ష్యం!