Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎటువైపు చూసిన ఫంక్షన్ హాల్స్ దర్శనమిస్తాయి. ఆ ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా సరైన అనుమతులు లేకుండానే నిర్మాణం చేసినట్లుగా పట్టణంలోని ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఫంక్షన్ హాల్ లో కొంత భాగం ప్రభుత్వ భూములకు సంబంధించినవి ఉన్నాయని చర్చ విస్తృతంగా సాగుతోంది. శనగపురం రోడ్డులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు అతి సమీపంలో ఉన్న బాలాజీ గార్డెన్ యజమాని ప్రమోద్ రెడ్డి శనగపురం వీరారం తండా కు చెందిన భూక్య శ్రీను మధ్య వివాదం. సబ్ జైలు సమీపంలో ఉన్న ఏబి గార్డెన్ కూడా మహబూబాబాద్ ఎంపీడీవో కార్యాలయం కోసం కొన్న స్థలంలోనే కట్టినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఫంక్షన్ హాల్ కు నిర్మాణం చేస్తున్న ఓ డాక్టర్ కు చెందిన అపార్ట్మెంట్ కూడా ఎంపీడీవో కార్యాలయానికి కొనుగోలు చేసిన స్థలంలోనే నిర్మాణం చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
విపరీతమైన చర్చ
ఎస్వీఎం ఫంక్షన్ హాల్ రైల్వే గేటు అండర్ బ్రిడ్జి నుంచి వచ్చే నాలా ను ఆక్రమించి అడ్డంగా నిర్మాణం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇకపోతే ఎన్నో రకాల ఆరోపణలు ఉన్న నందన గార్డెన్ సైతం 551 సర్వే నెంబర్లు నిర్మించినట్లుగానే విపరీతమైన చర్చ అప్పట్లో జరిగింది. ఈదుల పూస పెళ్లి రోడ్డులో ఉన్న పి ఎస్ ఆర్ గార్డెన్స్ సైతం వివాదంగానే నిర్మించినట్లుగా అది కూడా 287 సర్వేనెంబర్ లోని 20 గుంటల భూమిని ఆక్రమించి నిర్మాణం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కొంతమంది సెటిల్మెంట్ చేసుకొని ఊరుకున్నట్లుగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. 287 లో ఇల్లందు రహదారిలో నిర్మించిన ఆర్తి గార్డెన్స్ సైతం వివాదంగానే మారింది. మామూలుగా ఉన్న ఆర్తి గార్డెన్ ను అన్ని వివాదాలు సమసి పోయిన తర్వాత ఏసి గార్డెన్ గా రూపుదిద్దారంటూ చర్చ జరుగుతోంది. నిజాం చెరువు మత్తడిని ఆక్రమించి ఓ బీఆర్ఎస్ నాయకుడు నాలా పైనే ఫంక్షన్ హాల్ ను నిర్మించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎస్సార్ ఫంక్షన్ హాల్ ఎస్ వి విద్యాలయం రహదారికి ఎడమవైపున నిర్మించిన ఎస్సార్ ఫంక్షన్ హాల్ కూడా ప్రభుత్వ అసైన్డ్ 287 సర్వే నెంబర్లు నిర్మాణాలు చేపట్టినట్లుగా విస్తృతమైన చర్చ జరుగుతోంది.
పిఎస్ ఆర్ మినీ ఫంక్షన్ హాల్ లో మద్యం పార్టీ
ఫంక్షన్ హాల్ లంటే శుభకార్యాలు నిర్వహించేందుకు మాత్రమే నిర్మాణాలు చేస్తారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా ఏసియన్ పెయింట్స్ కు సంబంధించిన కంపెనీ మహబూబాబాద్ పట్టణంలోని పెయింటింగ్ వేసే వారందరికీ మద్యం పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిజంగానైతే ఫంక్షన్ హాల్ లలో మద్యం పార్టీ చేసుకోవాలంటే సంబంధిత ఎక్సైజ్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరగడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇంట్లో కాని లేదంటే ఇతర ప్రాంతాల్లో కానీ ఆరు ఫుల్ బాటిల్ల కంటే ఎక్కువ మందు లభ్యమైతే సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులు, సంబంధిత ఫంక్షన్ హాల్ కు సంబంధించిన వారిపై కేసులు నమోదు చేసి అవకాశం ఉంటుంది.
రెడ్డి కాలనీ లోని లక్ష్మీ కట్టయ్య, ఇందిరా గ్రౌండ్ లోని ఎస్ ఎస్ వి ఎల్
మహబూబాబాద్ పట్టణంలోని రెడ్డి కాలనీలోని లక్ష్మీ కట్టయ్య ఫంక్షన్ హాల్, ఇందిరా గ్రౌండ్ లోని ఎస్ ఎస్ వి ఎల్ ఫంక్షన్ హాల్ ల నిర్మాణం డొమెస్టిక్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ ఫంక్షన్ హాల్ గా నిర్మించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫంక్షన్ హాల్ లలో పని చేసే వారికి ప్రతి ఒక్కరికి లేబర్ లైసెన్సులు తీసుకొని, మున్సిపాలిటీ పర్మిషన్ తో శుభకార్యాలు నిర్వహించుకోవాలి. ఈ ఫంక్షన్ హాల్ లో ఎక్కడా కూడా ఇలాంటి నిబంధనలు కనిపించకపోవడం గమనార్హం.
భూగర్భ జలాల శాఖ తనిఖీలు
మహబూబాబాద్ ఫంక్షన్ హాల్ లలో నీటిని ఎంత ఎంత వాడుకుంటున్నామనే విషయంలోనూ బోర్ మోటార్లకు మీటర్లు అమర్చుకొని వాడుకోవాలి. ఈ నిబంధనను పాటించకపోవడంతో ఇటీవలనే భూగర్భ జల శాఖ అధికారులు అన్ని ఫంక్షన్ హాల్ లలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఒక్కో ఫంక్షన్ హాల్ కు 20వేల జరిమానా కూడా విధించినట్టుగా తెలుస్తోంది. ఫంక్షన్ హాల్ ల అక్రమ నిర్మాణాలపై ఇకపై స్వేచ్ఛలో ఒక్కొక్కటిగా వరుస కథనాలు ప్రచారం అవుతాయి.

