Huzurabad: హుజూరాబాద్ గడ్డపై మరోసారి ఉద్యమ సెగలు రాజుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, పచ్చని పంట పొలాలను శ్మశానాలుగా మార్చే ‘క్లస్టర్ డంపింగ్ యార్డ్’ నిర్ణయంపై స్థానిక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ గండం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రక్షిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో, హుజూరాబాద్ (Huzurabad) ఆత్మగౌరవం కోసం, భావి తరాల ఆరోగ్యం కోసం సామాజికవేత్త సబ్బని వెంకట్ చేపట్టిన పోరాటం ఇప్పుడు ఒక ప్రభంజనంలా మారుతోంది.
విషతుల్యం కానున్న గాలి నీరు భూమి!
డంపింగ్ యార్డ్ అంటే కేవలం చెత్త కుప్ప కాదు, అది ఒక మృత్యు కూపం. దీనివల్ల వెలువడే విషవాయువులతో పసిపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడతారని, భూగర్భ జలాలు కలుషితమై తాగే నీరు విషంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చని పైరులతో కళకళలాడే హుజూరాబాద్ పరిసరాలు రేపు క్యాన్సర్ వంటి వ్యాధులకు నిలయంగా మారాలా? అని సబ్బని వెంకట్ ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఏకమై ఇలాంటి వినాశకర ప్రాజెక్టులను తరిమికొడుతుంటే, హుజూరాబాద్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు.
Also Read: Huzurabad News: మిషన్ భగీరథకు తూట్లు.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు..?
అదిరిపోయిన సబ్బని వ్యూహం.. కదిలిన రాజకీయ యంత్రాంగం!
సబ్బని వెంకట్ తన నివాసానికి తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాంను ఆహ్వానించి, క్షేత్రస్థాయిలో ఉన్న భయానక పరిస్థితులను వివరించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కోదండరాం వంటి మేధావి ఈ పోరాటానికి మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వంపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. ఫలితంగానే, మొన్నటి వరకు ఈ అంశాన్ని పట్టించుకోని నాయకులు సైతం, సబ్బని సృష్టించిన ఈ ఉద్యమ తీవ్రతను చూసి శాసనమండలిలో గళమెత్తక తప్పలేదు. ఇది ముమ్మాటికీ సామాన్య ప్రజల గొంతుకగా సబ్బని వెంకట్ సాధించిన విజయం.
సర్కారుకు అల్టిమేటం: స్పందించకుంటే హైకోర్టుకే!
మా పొలాల్లో విషం చల్లుతామంటే చూస్తూ ఊరుకోం. ఇది కేవలం నోటీసు మాత్రమే.. ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ జీవోను రద్దు చేయాలి. లేదంటే త్వరలోనే మున్సిపల్ శాఖ మంత్రిని కలిసి గట్టిగా నిలదీస్తాం. అప్పటికీ న్యాయం జరగకపోతే ప్రజాకోర్టుతో పాటు హైకోర్టు మెట్లు ఎక్కుతాం” అని సబ్బని వెంకట్ హెచ్చరించారు.
Also Read: Huzurabad: వరి కొయ్యకాల్లను పొలంలోనే కలియదున్నండి.. ఎరువుల ఖర్చు తగ్గించే సాగు పద్ధతి ఇదే!

