Huzurabad: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద హుజూరాబాద్ (Huzurabad) పరిధిలోని జమ్మికుంటలో వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా తమ పిల్లలకు సంబంధించిన స్కాలర్‌షిప్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో, విద్యార్థుల విద్య, భోజన సదుపాయాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. జమ్మికుంటలోని మాస్టర్స్ ఎస్.వి. హైస్కూల్, విద్యోదయ హై స్కూల్, న్యూ మిలినియం హైస్కూల్ వంటి పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యపై తమ ఆవేదనను తెలియజేస్తూ హుజూరాబాద్‌లోని సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారికి వినతిపత్రం సమర్పించారు.
Also Read: Massive Explosion: బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు.. ఎగసిపడ్డ మంటలు.. ఆరుగురు స్పాట్ డెడ్
రెండేళ్ల బకాయిలు, నిరాశ చెందిన పాఠశాలలు
తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం, గత రెండు విద్యా సంవత్సరాలుగా తమ పిల్లల స్కాలర్‌షిప్ నిధులు విడుదల కాలేదు. ఈ క్రమంలో, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు పాఠాలతో పాటు భోజన సదుపాయాన్ని కూడా అప్పులు చేసి కల్పించాయి. అయితే, ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో, ఇకపై సదుపాయాలు కల్పించడం తమ వల్ల సాధ్యం కాదని పాఠశాల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. పాఠశాలలు సైతం ఈ సమస్యపై ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో, ఫీజులు చెల్లించని విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించడం లేదు. “ఫీజులు చెల్లించినట్లయితేనే పిల్లలను పాఠశాలకు పంపించండి, లేదంటే పంపించవద్దు” అని పాఠశాలలు స్పష్టం చేయడంతో, విద్యార్థులు స్కూలు ఆవరణలోకి కూడా రాలేకపోతున్నారు.
విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం
మా పిల్లల విద్యా భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ప్రభుత్వం వెంటనే బకాయిలు మంజూరు చేయకుంటే, మా పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది” అని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తల్లిదండ్రులు తమ వినతిలో పేర్కొన్నారు. కాబట్టి, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ప్రభుత్వం నుండి పెండింగ్ బకాయిలు వెంటనే విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా తమ పిల్లల విద్య కొనసాగేలా చూడాలని తల్లిదండ్రులు సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిని కోరారు.
Also Read: Travel Date Change: రైల్వేస్ నుంచి ఊహించని గుడ్‌న్యూస్.. ఇకపై టికెట్ కన్మార్ఫ్ అయ్యాక కూడా..
