Nizamabad: మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ, గుర్తు తెలియని ఇద్దరు అనాథ మృతదేహాలకు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన రెండు మృతదేహాలు ఎవరూ గుర్తించకపోవడంతో ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. ఈ మృతులు రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉండగా, పోలీసులు వారిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ వారు తుదిశ్వాస విడిచారు. వారికి సంబంధించిన గుర్తింపు (ఐడెంటిటీ) గానీ, బంధువులు గానీ లేకపోవడంతో, అంత్యక్రియల బాధ్యతను ఎవరూ తీసుకోలేదు.
సేవా సంస్థ చొరవ
ఈ పరిస్థితిని గమనించిన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆ బాధ్యతను స్వీకరించింది. నిజామాబాద్ 1వ ఠాణా పోలీసు సిబ్బంది, కామారెడ్డి పోలీసు సిబ్బంది అనుమతితో, మంగళవారం ఆ రెండు అనాథ శవాలకు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ గొప్ప కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, నరేశ్ రెడ్డి, 1వ ఠాణా పోలీసు సిబ్బంది తరఫున రాజ్‌గోపాల్, కామారెడ్డి పోలీసు సిబ్బంది తరఫున విజయ్ తదితరులు పాల్గొన్నారు. వారి మానవతా దృక్పథాన్ని పలువురు ప్రశంసించారు.
Also Read: Nizamabad Crime: తల్లి కోసమే హత్య? కారు డిక్కీ డెడ్ బాడీ కేసులో సంచలన నిజాలు..
