Nizamabad Crime: కలకలం రేపిన కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఎట్టకేలకు మహిళ మృతదేహం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి పూర్తి విషయాలను వెలికి తీసినట్లు సమాచారం.
నిజామాబాద్ నగర శివారులో గల కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద, మహిళ మృతదేహాన్ని నిజాంసాగర్ కెనాల్ లో పడేసేందుకు పలువురు ప్రయత్నించిన క్రమంలో వారిని పోలీసులు గుర్తించారు. డీ మార్ట్ వెనుక మహిళను హత్య చేసి, తర్వాత శవాన్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో సదరు వ్యక్తులు కారును ఆపకుండా వేగంగా వెళ్లడంతో పోలీసుల అనుమానం బలంగా మారింది. దీనితో పోలీసులు వెంబడించి మరీ కారును పట్టుకున్నారు. అసలు మహిళను హత్య చేశారా? హత్యకు గల కారణాలు ఏంటనే విషయంలో పోలీసులు దర్యాప్తు సాగించారు.
కక్షతోనే హత్య..
కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కారు డిక్కీలో గల మృతదేహం ముబారక్ నగర్ కు చెందిన కమలగా గుర్తించారు. ఆ తర్వాత అసలు విషయాలను పోలీసులు తెలుసుకున్నారు. నిజామాబాద్ కు చెందిన డ్రైవర్ రాజేష్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతురాలు కమలకు రాజేష్ తల్లికి ఆర్థిక వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెడు మార్గాలకు కూడా ఆమె ప్రేరేపించిందని, దీనితో కక్ష పెంచుకున్న రాజేష్ బండరాయితో కొట్టి చంపేసినట్లు పోలీసుల వద్ద ఉన్న సమాచారం.
Also Read: Telangana BJP: బిజెపిలో అయోమయం.. రోజుకో పేరు తెరపైకి.. ఇంతకు ‘చీఫ్’ ఎవరు?
హత్య చేసిన అనంతరం డిక్కీలో కుక్కి నిజాంసాగర్ కెనాల్ లో పారేయాలని ప్లాన్ చేసిన క్రమంలో, పోలీసులు గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కమల మృతదేహాన్ని తరలించేందుకు కారును అద్దెకు తీసుకొని రాజేష్ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసు సంచలనంగా మారగా, ఎట్టకేలకు పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు.