Mahabubabad: ప్రకృతి విపత్తుల సమయంలో మానవత్వం ఎలా విజయం సాధిస్తుందో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో చోటుచేసుకున్న ఈ యథార్థ సంఘటన నిరూపించింది. జిల్లాలను వణికించిన “మొంథా” తుఫాన్ విధ్వంసం మధ్య, 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అసాధారణ ధైర్యం, నిబద్ధత మృత్యువు అంచున ఉన్న రెండు కుటుంబాలకు పునర్జన్మను ప్రసాదించింది. వావిలాల గ్రామంలో శ్వాస అందక బాధపడుతున్న రోగి, అలాగే రావిరాల గ్రామంలో పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణి ప్రాణాలను కాపాడాల్సిన అత్యవసర పరిస్థితి! వారి ఆశలన్నీ పైలట్ మల్లేష్, ఈఎంటీ వీరన్న, సిబ్బంది రాజు నేతృత్వంలోని 108 బృందం మీదే కానీ, నెల్లికుదురు ప్రధాన మార్గంలో కుండపోత వర్షం, గాలివానల దాటికి ఒక భారీ వృక్షం కూలి, రహదారికి పూర్తిగా అడ్డంగా నిలిచింది. ఒక అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఇక్కడే ఆగిపోతే రెండు అమూల్యమైన ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.
సురక్షితంగా రోగిని, గర్భిణిని ఆసుపత్రి
అక్కడ ఆగేది లేదు! తమ బాధ్యత ముందు ప్రకృతి అడ్డంకి చిన్నదైపోవాలని నిర్ణయించుకున్నారు ఆ యోధులు. సేవే మా ధర్మం అన్న ఏకైక లక్ష్యంతో, ఉధృత వర్షంలో తడుస్తూనే, తమ చేతులతో గొడ్డలి పట్టి, ఆ భారీ వృక్షాన్ని ఛేదించడం మొదలుపెట్టారు. అలుపెరగని శ్రమ, అద్భుతమైన తెగువతో… తమకు తామే దారిని సృష్టించుకున్నారు. ఆపదలో ఉన్న వారిని చేరుకోవడానికి క్షణం కూడా వృథా చేయకుండా వేగంగా దూసుకెళ్లి, సరిగ్గా సమయానికి ఆ రెండు గ్రామాలకు చేరుకున్నారు. సురక్షితంగా రోగిని, గర్భిణిని ఆసుపత్రికి తరలించి, ప్రాణాలు నిలిపారు. కేవలం అంబులెన్స్ సిబ్బందిగానే కాకుండా, ప్రాణదాతలుగా నిలిచిన మల్లేష్, వీరన్న, రాజులకు ఈ ప్రాంత ప్రజలు, యావత్ రాష్ట్రం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ప్రకృతి విపత్తును తమ ధైర్యంతో జయించిన వీరు… ఈ అంబులెన్స్ దళం సమాజానికి ఆదర్శప్రాయులు నిలిచారు. సలాం 108 ఆంబులెన్స్ సిబ్బంది అంటూ స్థానిక ప్రజలు అభినందించారు.
Also Read: Mahabubabad District: తొర్రూరు మున్సిపాలిటీలో వివాదం.. శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు?
