Caste Certificate: ఓ యువకుడు కుల ధృవీకరణ పత్రం(Caste Certificate) కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పత్రాలన్ని తీసుకుని హయత్ నగర్(Hayath Nagar) తహసిల్దార్ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఉన్న డబ్బాలో వేయాల్సిందిగా అక్కడి సిబ్బంది సూచించారు. వారం రోజుల తర్వాత వెళ్తే దరఖాస్తు కనిపించడం లేదు. మరోసారి మీ సేవ(Meeseva)లో దరఖాస్తు చేసుకోమని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తహసిల్దార్ కార్యాలయాల్లో ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా నిత్యం అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సర్టిఫికెట్లకోసం తప్పని నిరీక్షణ
విద్యా సంస్థల్లో ప్రవేశాలకైనా ఉద్యోగాల్లో చేరేందుకైనా కుల, ఆదాయ, స్థానిక ధృవీకరణ పత్రాలు(Caste Income Certificate) తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ అవసరాన్ని అవకాశంగా తీసుకుంటున్న రెవిన్యూ(Revenue) సిబ్బంది కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం కారణంగా సకాలంలో చేతికందక ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అమ్యామ్యాల కోసమే కొందరు సిబ్బంది కావాలనే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతి పనికి రేటు నిర్దేశిస్తుండడంతో ఉమ్మడి రంగారెడ్డి(Ranga Reddy) జిల్లాలో రెవిన్యూ కార్యాలయాలు అక్రమార్జనకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
అధికారులు అలసత్వం
పౌర సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది దళారులతో కుమ్మక్కవుతున్నట్లు టాక్ విన్పిస్తోంది. మీ సేవ ద్వారా వెళ్లే దరఖాస్తులను పరిశీలించి ధృవీకరణ పత్రాలను జారీ చేయాల్సిన అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. దరఖాస్తుదారుడు నేరుగా వెళ్తే నిర్ధాక్షిణంగా దరఖాస్తులను రిజెక్ట్ చేస్తున్నారు. అదే దళారుల ద్వారా వెళ్తే వెంటనే పని అయిపోతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం అంతంత మాత్రంగానే ఉంటుండడంతో తహసిల్దార్(MRO) కార్యాలయాల్లో సిబ్బంది, దళారులది ఆడిందే ఆట అన్నట్లుగా సాగుతోంది.
Also Read: Kannappa Movie: పవన్ కళ్యాణ్ నిర్ణయంతో ‘కన్నప్ప’కు ఎంత లాభమో! ఇప్పటికైనా తెలిసిందా?
హయత్ నగర్‌లో దళారులదే హవా
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్(Hyathnagar) తహసిల్దార్ కార్యాలయంలో సిబ్బంది అరాచకాలు మరింతగా శ్రుతి మించాయన్న విమర్శలు వస్తున్నాయి. కొంతమందికి ఒకటి, రెండు రోజుల్లోనే సర్టిఫికెట్లు మంజూరు అవుతుండగా మరికొందరి దరఖాస్తులు వారాల తరబడిగా పెండింగ్‌లో ఉంటున్నాయి. మీ సేవ(Meeseva)లో దరఖాస్తు చేసుకుని దరఖాస్తుతో పాటు జత చేసిన పత్రాలను తహసిల్దార్ కార్యాలయంలో సమర్పిస్తే సిబ్బంది పరిశీలన చేసి సర్టిఫికెట్లను జారీ చేయాలి. కానీ ఇక్కడి సిబ్బంది మాత్రం తమ రూటే సపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తులను బాక్స్ లో వేసి వెళ్లాలని సిబ్బంది చెబుతుండగా కొద్ది రోజుల తర్వాత వెళ్తే దరఖాస్తు కనిపించడం లేదని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారు.
నెలల తరబడిగా తిరగాల్సిన దుస్థితి
దరఖాస్తులో ఏమైనా లోపాలు ఉంటే దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి విచారణ జరపాల్సి ఉండగా ఎలాంటి సమాచారం లేకుండానే రిజెక్ట్ చేస్తున్నారని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు. దీంతో మీ సేవ, తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ బాధితులు నెలల తరబడిగా తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అయితే డబ్బులు ఇచ్చి దళారుల ద్వారా వెళ్తే సత్వరమే సర్టిఫికెట్లు(Certificate) మంజూరు అవుతున్నాయన్న ప్రచారం స్థానికంగా విస్తృతంగా జరుగుతోంది. ఈ తహసిల్దార్ కార్యాలయం పరిధిలోని ఓ ప్రభుత్వ మీ సేవా(Govt Meeseva) వద్దనే దళారులు సర్టిఫికెట్ల దందాను సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సర్టిఫికెట్‌ను బట్టి రూ.500ల నుంచి రూ.1500ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. హయత్ నగర్ తహసిల్దార్ వివరణ కోసం ‘స్వేచ్చ’ ప్రతినిధి పలుమార్లు ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
Also Read: Kavitha’s Rail Roko: రైల్ రోకోకు లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన కవిత