Kavitha’s Rail Roko: బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతునివ్వాలని వామపక్ష పార్టీలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కోరారు. సీపీఎం(CPM) రాష్ట్ర కార్యాలయంలో ఎంబీ భవన్ లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(Jhon Wessley), అడిక్ మెట్ లోని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్ లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వర రావు(Venkateshwar Rao), జేవీ చలపతి రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె. గోవర్ధన్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు
42శాతం రిజర్వేషన్(Reservation) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపి 3 నెలలవుతుందని, కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వివరించారు. వచ్చే నెల 17న నిర్వహిస్తున్న రైల్ రోకోకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్(Kamareddy Declaration) అమలు కోసం తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏడాదిగా అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్వహించామన్నారు.
తమతో పాటు బీసీ సంఘాలు చేసిన ఆందోళనలకు దిగివచ్చే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్ లో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు మరో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింపజేసిందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం తాము రెండేళ్లుగా ఉద్యమిస్తున్నామని తెలిపారు.
అధికారంలో ఉన్నామని
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రం బీసీ బిల్లు కు ఆమోదముద్ర వేయాలంటే ఉద్యమబాట ఒక్కటే మార్గమని, రైల్ రోకోకు(Rail Roco) పిలుపునిచ్చామని తెలిపారు. తమతో కలిసి వచ్చే భావసారూప్యత ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి రైల్ రోకో నిర్వహిస్తామన్నారు. బీసీ(BC) బిల్లు ఆమోదానికి ఎంత ఆలస్యమైతే బీసీలకు అంత అన్యాయం జరుగుతుందన్నారు. అధికారంలో ఉన్నామని ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో కాంగ్రెస్ తల్లి విగ్రహాలను ప్రతిష్టిస్తుందని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాలను గౌరవ మర్యాదలతో గాంధీ భవన్(Ghandhi Bhavan) కు పంపిస్తామన్నారు. ప్రభుత్వం మార్చుతోన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజామోదం లేదన్నారు.
Also Read: By Polls 2025: ఉపఎన్నికల్లో మారిపోయిన ఆప్, బీజేపీ ముఖచిత్రాలు
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి : జాన్ వెస్లీ
బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ(Delhi)కి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పైనే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి అన్నారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేస్తోన్న ఉద్యమాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం న్యాయమైన డిమాండ్ అన్నారు. రిజర్వేషన్లను పెంచి అసమానతలను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. బీజేపీ ఎప్పటికీ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగానే ఉంటుందన్నారు.
ప్రజా ఉద్యమాలకు తలొగ్గి కేంద్రం కులగణన చేయడానికి ముందుకొచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులపై ఉందన్నారు. కేంద్రానికి వినతిపత్రాలు ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కావొద్దని.. అన్నిపార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.